
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ ఫోన్లలో A సిరీస్ మొబైల్స్ బెస్ట్ ఫీచర్స్‌తో పాటు బడ్జెట్ రేట్లో లభిస్తుంటాయి. దీంతో ఈ ఫోన్ కోసం మొబైల్ ప్రియులు ఎగబడుతుంటారు. ప్రస్తుతం ఆ సంస్థ.. గూగుల్ పిక్సెల్ 9A సిరీస్ ను లాంఛ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అదిరిపోయే ఫీచర్లతో పాటు తక్కువ ధరకే లభించనున్న ఈ ఫోన్ కోసం చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. గూగుల్ పిక్సెల్ 9A ఫోన్ లాంఛ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పలు మొబైల్ మార్కెట్ సంస్థల నివేదికల ప్రకారం.. 2025, మార్చి 19న గూగుల్ పిక్సెల్ 9A సిరీస్ ఫోన్ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో ఫోన్ అమ్మకాలు 2025, మార్చి 26 నుంచి మొదలవుతాయని టెక్ వర్గాల టాక్. అయితే.. గూగుల్ దీనిపై ఎటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. త్వరలో మార్కెట్లోకి రానున్న గూగుల్ పిక్సెల్ ఫోన్లలో 9A ఫోన్ ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
పిక్సెల్ 9a డిజైన్, డిస్ప్లే
పిక్సెల్ 9a డిజైన్‌లో గూగుల్ పెద్దగా మార్పులు చేయకపోవచ్చని టాక్. ఈ ఫోన్ క్లాసిక్ పిక్సెల్ A-సిరీస్ లుక్‌ని మాదిరిగా కాంపాక్ట్ బాడీ, బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో ఉండనుంది. ప్రస్తుతం లీక్ అయిన వివరాల ప్రకారం.. పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల డిస్ప్లేతో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మొత్తం నాలుగు రంగుల్లో ఉండనున్నట్లు సమాచారం. ఐరిస్ (నీలం), అబ్సిడియన్ (నలుపు), పియోనీ (గులాబీ), పింగాణీ (తెలుపు) వంటి నాలుగు షేడ్స్‌లో ఉండే అవకాశం ఉంది.
పిక్సెల్ 9a ఫీచర్లు
పిక్సెల్ 9a గూగుల్ టెన్సర్ G4 చిప్‌తో రానున్నట్లు టాక్. ఫోన్ అదనపు రక్షణ కోసం గూగుల్ టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ కూడా ఉండే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. పిక్సెల్ 9a ఆండ్రాయిడ్ 15తో లాంచ్ అవుతుందని అంచనా. 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. 13MP ఫ్రంట్ కెమెరాను ఉండనుంది. బ్యాటరీ కెపాసిటీ 5,100mAh ఉండే ఛాన్స్ ఉంది. 23W వైర్డ్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జర్.
పిక్సెల్ 9a ధర
గూగుల్ పిక్సల్ 9a 128GB వేరియంట్ ధర సుమారు రూ. 42,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియాలో ట్యాక్స్‌ల కారణంగా ధర రూ. 50,000 వరకు పెరగవచ్చు.