మీ పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తున్నారా.. పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచలేకపోతున్నారా..చాలా మంది పేరెంట్స్ లో ఇది ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారింది. ప్రతి పేరెంట్స్ ఎదుర్కొంటున్న సమస్య.. అయితే పేరెంట్స్ సమస్యకు గూగుల్ త్వరలో చెక్ పెట్టబోతోంది. గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులో తెస్తోంది.. అదే గూగుల్ స్కూల్ టైం ఫీచర్..
ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు, శాంసంగ్ వేర్ ఓఎస్ వాచ్ లలో స్కూల్ టైమ్ ఫీచర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ యాక్టివిటీని పరిమితం చేయవచ్చు.
పిల్లల స్మార్ట్ ఫోన్ వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణకు ఈ స్కూల్ టైమ్ ఫీచర్ (‘school time’ feature) ను తీసుకువస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల స్మార్ట్ ఫోన్ లు కాలింగ్, మెసేజింగ్ వంటి కొన్ని ముఖ్యమైన పనులకు మాత్రమే సెల్ ఫోన్ వినియోగించడానికి సహాయపడుతుంది. ఫోన్ లో ‘స్కూల్ టైమ్’ ఫీచర్ యాక్టివేట్ చేసి పిల్లల స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయొచ్చు.
స్కూల్ టైమ్ ఫీచర్ ను ఎలా వినియోగించాలి?
తల్లిదండ్రులు తమ పిల్లలు తరగతులకు హాజరవుతున్నప్పుడు వారు దృష్టి మరల్చకుండా ఉండటానికి ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేయవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వంటి డివైజ్ లను వినియోగించొద్దు అని అనుకున్న ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. డేట్, టైమ్ ను షెడ్యూల్ చేయొచ్చు. ఫ్యామిలీ లింక్ యాప్ ను ఉపయోగించవచ్చు. యాప్ వినియోగాన్ని ఎంచుకోవచ్చు. అదే సమయంలో పిల్లలు నిర్దిష్ట కాంటాక్ట్ లకు మాత్రమే కాల్ చేయడానికి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యాక్టివ్ గా ఉండేలా తల్లిదండ్రులు స్కూల్ టైమ్ మోడ్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ మోడ్ ను ఎప్పుడైనా అన్ లాక్ చేయవచ్చు.
వచ్చే ఏడాది ప్రత్యేక ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ వాచ్ లలో ఈ ఫీచర్ ను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 7 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం గూగుల్ లాంచ్ చేసిన ఫిట్ బిట్ ఏస్ ఎల్టీఈ స్మార్ట్ వాచ్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గేమ్ స్టూడియో ఫీచర్లతో పాటు లొకేషన్, ఫిట్నెస్ ట్రాకర్ ఉన్నాయి.
యూట్యూబ్ యాక్టివిటీస్ కూడా..
అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల యూట్యూబ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అనుమతించే ఫీచర్ ను లాంచ్ చేయాలని యూట్యూబ్ యోచిస్తోంది. ఈ ఫీచర్ కోసం తల్లిదండ్రులు తమ ఖాతాలను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.