కొలిక్కి వచ్చిన గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ కేసు.. గుత్తాధిపత్యం కోసం చేసిన పనికి రూ.20 కోట్ల భారీ మూల్యం

కొలిక్కి వచ్చిన గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ కేసు.. గుత్తాధిపత్యం కోసం చేసిన పనికి రూ.20 కోట్ల భారీ మూల్యం

గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. మొబైల్, టీవీ ఆండ్రాయిడ్ డివైజ్ లలో డామినెంట్ పొజిషన్ లో ఉండేందుకు గూగుల్ విధించిన నిబంధనలపై కొన్నేండ్లుగా కేసు నడుస్తోంది. డివైజ్ లను తయారు చేస్తున్న సమయంలోనే ఆండ్రాయిడ్ ఓఎస్ (Android TV OS)  లలో ప్లేస్టోర్ కంపల్సరీగా ఉండేలా నిబంధనలు విధించింది. దీనితో పాటు కాంపిటిటివ్ ఓఎస్ లను నిలువరించేలా ఒప్పందం చేసుకుంది. దీనిపై కంపెనీలు సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా)ను ఆశ్రయించాయి. ఈ కేసులో గూగుల్ పై సీసీఐ భారీ పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. 

అయితే ఈ కేసులో ఎట్టకేలకు సెటిల్ మెంట్ చేసుకునేందుకు సీసీఐ అనుమతించింది. మొత్తం 20 కోట్ల 24 లక్షల రూపాయలతో సెటిల్ మెంట్ చేసుకోనుంది గూగుల్. అందుకు అంగీకరిస్తూ సోమవారం (ఏప్రిల్ 21) సీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇండియాలో స్మార్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఓఎస్ (Android Smart TV OS) ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. దీనికి  అదనంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో ప్లే స్టోర్ డామినెంట్ పొజిషన్ లో ఉండేలా గూగుల్ నిబంధనలు విధించింది. ఆండ్రాయిడ్ ఆల్టర్నేటివ్ వర్షన్స్ ను తమ డివైజ్ లలో డెవలప్ చేయని కంపెనీలతో (ఆండ్రాయిడ్ ఫోర్క్స్) మాత్రమే ఒప్పందం కుదుర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమైన అంశంగా సీసీఐ నిర్ధారించింది. 

స్మార్ట్ టీవీల్లో గూగుల్ యాప్స్ అన్నీ బండిల్ గా ఇన్ బిల్ట్ లో ఉండేలా.. ఆండ్రాయిడ్ వర్షన్ వాడాలంటే ప్లే స్టోర్ టాప్ పొజిషన్ లో ఉండేలా ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలపై నిబంధనలు విధించింది గూగుల్. దీని వలన ఇతర ఓఎస్ కంపెనీలు స్మార్ట్ టీవీలో పోటీ పడేందుకు కష్టమైన పని.  పరోక్షంగా గూగుల్ ఓఎస్ , ప్లే స్టోర్ గుత్తాధిపత్యం ఉండేలా వ్యవహరించిందని సీసీఐ విచారణలో తేలింది. దీనిపై చాలా ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. గతంలో పలుమార్లు భారీ జరిమానా విధించిన సీసీఐ.. లేటెస్ట్ గా  20 కోట్ల 24 లక్షల రూపాయలతో ఈ కేసును సెటిల్ చేసుకునేందుకు అంగీకరించింది.