గూగుల్ బాస్ అంటే మాటలా.. : సుందర్ పిచాయ్ భద్రతకు రూ.10 కోట్లు

గూగుల్ బాస్ అంటే మాటలా.. : సుందర్ పిచాయ్ భద్రతకు రూ.10 కోట్లు

ఏడాదికి రూ.10 లక్షల జీతం వస్తేనే ఆహో ఓహో అంటారు. అలాంటిది కేవలం ఒక వ్యక్తి భద్రత కోసమే ఏడాదికి దాదాపుగా రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవును మీరు చదివింది నిజమే. వ్యక్తిగత భద్రత కోసం రూ.10 కోట్లు ఏంటీ అనుకుంటున్నారా..? మరీ ఇంత ఖర్చు పెడుతున్నారంటే అవతలి వ్యక్తి ఎలాంటి ఏ స్థాయిలో ఉంటారో ఊహించుకోండి. ఆయన ఎవరో కాదు.. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. అవును.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఏడాదికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెడుతోంది గూగుల్. ఈ విషయం స్వయంగా గూగుల్ సంస్థే వెల్లడించింది. 

2024లో సీఈఓ సుందర్ పిచాయ్ వ్యక్తిగత భద్రత కోసం 8.27 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.10 కోట్లు) చెల్లించినట్లు US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దాఖలు చేసిన ఫ్రాక్సీ ఫైలింగ్‌లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ పేర్కొంది. 2023లో సుందర్ భద్రత కోసం 6.78 మిలియన్ల ఖర్చు చేయగా.. 2024లో అది 22 శాతం పెరిగి 8.27 మిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2024లో ప్రపంచ నాయకులతో కృత్రిమ మేధస్సు (AI)తో సహా సాంకేతిక పురోగతుల గురించి చర్చించేందుకు పిచాయ్ సుధీర్ఘ ప్రయాణాలు చేశారు. దీని వల్లే 2023తో పోలిస్తే 2024లో పిచాయ్ భద్రత ఖర్చలు పెరిగినట్లు గూగుల్ వెల్లడించింది.

‘‘2024లో సుందర్ భద్రతా ఖర్చులో నివాస భద్రత, ఇతరులతో సంప్రదింపుల రుసుములు, భద్రతా పర్యవేక్షణ సేవలు, కారు, డ్రైవర్ సేవలు వీటితో పాటు ప్రయాణాల సమయంలో వ్యక్తిగత భద్రత ఖర్చు” ఉందని ఆల్ఫా బెట్ ఈ ఫైలింగ్‎లో పేర్కొంది. సీఈవో పిచాయ్ భద్రత ఏర్పాట్లు, ఖర్చులు సహేతుకమైనవని.. ఆల్ఫాబెట్, దాని స్టాక్‌హోల్డర్ల ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే అవి మా వ్యాపారానికి నష్టాలను తగ్గిస్తాయని సంస్థ తెలిపింది. 

గత సంవత్సరం డిసెంబర్‌లో యునైటెడ్ హెల్త్ CEO బ్రియాన్ థాంప్సన్ దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో అప్పటి నుంచి అన్ని పేరు మోసిన కంపెనీలు తమ సంస్థల్లోని అగ్ర కార్యనిర్వాహకులకు భద్రతను కట్టుదిట్టుం చేశాయి. ఇందులో భాగంగానే గూగుల్ కూడా తమ కంపెనీ సీఈవో పిచాయ్ భద్రతను పెంచింది. ఈ ప్రభావంతో భద్రతా ఖర్చులు కూడా హైక్ అయ్యాయి.  ఇక ప్రాక్సీ ఫైలింగ్ ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో పిచాయ్ స్టాక్ అవార్డులతో సహా మొత్తం 10.73 మిలియన్ల నగదు బహుమతి అందుకున్నారు. ఇది గత సంవత్సరం (2023) కంటే 8.8 మిలియన్ల కంటే ఎక్కువ.