న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమను బెదిరిస్తోందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆరోపించింది. అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తోందంటూ గూగుల్ మీద వస్తున్న ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే దర్యాప్తునకు సంబంధించిన నివేదికలోని సీక్రెట్ సమాచారాన్ని లీక్ చేశామని.. ఈ విషయంలో తమను కోర్టుకు ఈడుస్తామంటూ బెదిరిస్తున్నారని సీసీఐ పేర్కొంది.
కాలిఫోర్నియాలోని గూగుల్ కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని ఢిల్లీ హైకోర్టుకు సీసీఐ తెలిపింది. ఈ సమాచారాన్ని బయటకు వెల్లడిస్తే మీడియాను కూడా కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారని స్పష్టం చేసింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే గూగుల్ ఇలా చేస్తోందని ఆరోపించింది. మరో 10 రోజుల్లో దర్యాప్తునకు సంబంధించిన అన్ని నివేదికల్ని గూగుల్‌కు పంపుతామని.. ఆ తర్వాత వారిని వివరణ కోరతామని పేర్కొంది.