వంద రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయాలి

వంద రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయాలి
  • గ్రామ స్థాయికి ‘గోపా’ను విస్తరించాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా)ను గ్రామ స్థాయికి విస్తరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వంద రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ లో గోపా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ప్రెసిడెంట్ బండి సాయన్న గౌడ్, జనరల్ సెక్రటరీ జీవీ శ్రీనివాస్ గౌడ్ సహా మొత్తం 50 మంది ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని గౌడ్స్ అందరూ గోపాలో మెంబర్ షిప్ తీసుకోవాలని ఆయన సూచించారు. వంద రోజుల్లో లక్ష సభ్యత్వాలు పూర్తి చేయాలని కొత్త కార్యవర్గాన్ని కోరారు. 

గోపా ఆధ్వర్యంలో గౌడ్స్ వర్గంలోని పేద స్టూడెంట్లకు ఆర్థికంగా సాయం అందజేయాలని, జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. గౌడ్స్ అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని, అన్ని రంగాల్లోనూ రాణించాలని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ‘‘గోపా 50 ఏండ్ల కింద ఏర్పడింది. దీన్ని జిల్లా, మండల, గ్రామ స్థాయిలోనూ విస్తరించాలి. కమిటీలు ఏర్పాటు చేయాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.