సికింద్రాబాద్, వెలుగు: మొబైళ్లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా వెంటనే సమీప పీఎస్‌లో ఫిర్యాదు చేసి, సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ సూచించారు. నార్త్‌జోన్‌లోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 153 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి 117 మంది బాధితులకు అందజేశారు.
ఈ మేరకు సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇక నుంచి రికవరీ చేసిన సెల్ఫోన్లను ప్రతి నెలా బాధితులకు అందజేస్తామన్నారు. మొత్తం 153 సెల్ఫోన్లలో గోపాలపురం -60, తుకారాంగేట్-05, తిరుమలగిరి-16, మార్కెట్-15, మహంకాళి-10, బోయిన్పల్లి-10 , బేగంపేటలో -ఐదు రికవరీ చేసినట్లు చెప్పారు.
గోపాలపురం పరిధిలోనే ఎక్కువగా సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ప్రాంతంలో రద్దీ ఉన్న సమయాల్లో దొంగలు సెల్ఫోన్లు కొట్టేస్తున్నారని, అలాగే కొందరు ప్రయాణికులు హడావుడిలో రైళ్లు, బస్సులు ఎక్కే క్రమంలో ఫోన్లు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో ఏసీపీలు రమేశ్, సుబ్బయ్య, నార్త్జోన్పరిధిలోని సీఐ పాల్గొన్నారు.