
అది కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతం.. ఆ ఏజెన్సీ ప్రాంతంలో కరింపలనులు అనే గిరిజన తెగ నివసిస్తుంటారు. అటవీ భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేయడం ఈ తెగ వృత్తి. వీళ్ళు మలయాళంలో తుళు పదాలు కలిసిన భాష మాట్లాడుతుంటారు. ఇలాంటి తెగలో పుట్టిన గోపికా గోవింద్.. తొలి ఆదివాసీ ఎయిర్ హోస్టెస్ గా ఘనత సాధించింది... ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని తెగ నుంచి వచ్చిన గోపికా గోవింద్.. ఎన్నో అవాంతరాలు దాటుకొని ఎయిర్ హోస్టెస్ దాకా ఎలా ఎదిగింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
అటవీ భూమిలో వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడ్డ కరింపలనులు తెగకు చెందిన గిరిజనులు ఇప్పుడు వ్యవసాయానికి అటవీ భూమి లభించకపోవడంతో అటవీ భూమిలో కెట్టెల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముకొంటు జీవనం సాగిస్తున్నారు. అయితే.. అటవీ అధికారులు కట్టెలు కాల్చడాన్ని అడ్డుకోవడంతో ఆ తెగకు ఉన్న ఒక్క జీవనాధారం కూడా లేకుండాపోయింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితి నుంచి వచ్చి ఎయిర్ హోస్టెస్ అవ్వాలన్న తన కలను సాకారం చేసుకున్న గోపిక తన తెగకు మాత్రమే కాకుండా.. మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి.
Also Read : ఫ్యాన్ రిపేర్ చేయడానికి అని పిలిచి పెళ్లి చేసుకుంది.
తన చిన్న వయసు నుంచి అమ్మ నాన్న చేసే పని చూస్తూ.. వారికి సాయం చేస్తూ పెరిగిన గోపిక ఎలా అయినా ఎయిర్ హోస్టెస్ అయ్యి అంబరాన్ని తాకడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలా డిగ్రీ కంప్లీట్ చేసిన గోపిక.. ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రైవేట్ కాలేజీల్లో ఈ కోర్స్ చేయాలంటే లక్షల్లో ఫీజులుంటాయి.. అంత డబ్బు తన పేరెంట్స్ కట్టలేరని గోపికకి తెలుసు. అందుకే ఎమ్మెస్సీ కెమిస్ట్రీ జాయిన్ అయ్యింది. ఎమ్మెస్సీ అయితే జాయిన్ అయ్యింది కానీ.. గోపిక ధ్యాస అంతా ఎయిర్ హోస్టెస్ అవ్వడం మీదే ఉంది.
ఈ క్రమంలోనే ఐఏటీఏ అందిస్తున్న కస్టమర్ సర్వీస్ కోర్సును చేసేందుకు ఎస్టీ విద్యార్థులకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుందని తెలుసుకొని అప్లై చేసింది గోపిక. ఆ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయ్యింది గోపిక. దీంతో గోపిక కల సాకారం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. గవర్నమెంట్ అందించే స్కాలర్షిప్ తో వాయనాడ్ లోని డ్రీం స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేసింది గోపిక. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో ఇంటర్వ్యూకి వెళ్లి ఎయిర్ హోస్టెస్ గా సెలెక్ట్ అయ్యింది గోపిక. మొత్తానికి ఎయిర్ హోస్టెస్ అవ్వాలన్న తన కల సాకారం చేసుకుంది గోపికా గోవింద్.
ఆకాశంలో విమానం ఎగురుతుంటే కింద నుంచి చూడటమే తప్ప... విమానం ఎక్కడం తెలియని అట్టడుగు స్థాయి నుంచి వచ్చి.. తన కల కోసం కష్టపడి.. ఎట్టకేలకు సాకారం చేసుకుంది గోపికా గోవింద్. గోపికా గోవింద్ ఒక్క గిరిజన జాతికే కాదు.. అన్ని వసతులు ఉన్నా కష్టపడటానికి బద్దకించి ఏవేవో సాకులు చెప్పే మనలో చాలామందికి ఇన్స్పిరేషన్.