ఖమ్మం టౌన్, వెలుగు : తనపై కుట్ర పూరితంగా మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సప్లై చేస్తున్నారనే కేసులు నమోదు చేశారని ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ ఎం.ఎఫ్. గోపినాథ్ ఆరోపించారు. మంగళవారం సిటీలోని తన హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ బచావో అనే సంస్థ ద్వారా నేషనల్ క్యాంపెయిన్ ను అక్టోబర్ 2022 నుంచి వారు ప్రారంభించినట్లు తెలిపారు.
దేశాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ, ముంబాయి, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, పాట్నా లో ఉన్న మేధావులతో కలిసి భారత్ బచావో సంస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే తమ గొంతు నొక్కాలని కుట్రపూరితంగా కేసు నమోదు చేయించిందని ఆరోపించారు. ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ లో 120 బి, ఉపా కేసును పెట్టారని చెప్పారు. ఎన్ని కుట్రపూరిత కేసులు పెట్టిన, తాము దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.