బీసీ కమిషన్​ చైర్మన్‌గా నిరంజన్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

బీసీ కమిషన్​ చైర్మన్‌గా నిరంజన్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి 
  • విద్యా కమిషన్​ చైర్మన్​గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
  • వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌‌గా కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీసీ కమిషన్ చైర్మన్‌‌గా గోపిశెట్టి నిరంజన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే కీలకమైన విద్యా కమిషన్ చైర్మన్‌‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్‌‌గా కోదండ రెడ్డిని అపాయింట్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని నియమించారు. 

బీసీ వెల్ఫేర్ కమిషనర్ మెంబర్ సెక్రటరీ గా వ్యవహరిస్తారు. కాగా, బీసీ కమిషన్‌‌ చైర్మన్‌‌, సభ్యుల పదవీ కాలం గత నెలతోనే ముగిసింది. దీంతో ప్రభుత్వం బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్​గా పీసీసీ సీనియర్‌‌ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ ను నియమించింది. కొత్తగా నియమించిన సభ్యులు కూడా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. 

కులగణన నేపథ్యంలో.. 

పంచాయతీ ఎన్నికలకు ముందే బీసీ కులగణన చేపట్టాలని సర్కార్ నిర్ణయించడంతో బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్, సభ్యుల నియామకం కీలకంగా మారింది. మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థలను, గురుకులాలను కార్పొరేట్​కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ​ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్​గా నియమించింది. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని సర్కార్ భావిస్తున్నది. 

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డిని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్​గా నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్ ఆరేండ్లు.. విద్య, వ్యవసాయ కమిషన్ల చైర్మన్లు రెండేండ్ల పాటు ఆ పదవిలో ఉంటారు.