నిలిచిన గోరఖ్​పూర్​-మహబూబ్​నగర్​ స్పెషల్​ రైలు

మందమర్రి-బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య  (ఓవర్​హెడ్​ ఎలక్ర్టిక్​ వైర్​)ఓహెచ్​ఈ తెగిపోవడంతో మూడు గంటల పాటు పలు ఎక్స్​ప్రెస్​, సూపర్​ఫాస్ట్​ రైళ్లను రైల్వే ఆఫీసర్లు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోరఖ్​పూర్​ నుంచి మహబూబ్​నగర్​కు వెళ్లే సమ్మర్​ స్పెషల్​ ట్రైన్​ బెల్లంపల్లి నుంచి బయలుదేరి వెళ్లగా మందమర్రి రైల్వే స్టేషన్​కు రెండు కిలోమీటర్ల సమీపంలో రైల్​ఇంజిన్​ పై భాగంలోని ఓహెచ్ఈ  వైర్​ ఇరుక్కుపోయి  తెగిపోయింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. గోరఖ్​పూర్​-మహబూబ్​నగర్​ ఎక్స్​ప్రెస్​ రైలు ఆగిపోవడంతో దాని వెనకాలే వచ్చే రాజధాని, కోర్బా,  కాగజ్​నగర్​- సికింద్రాబాద్​ ఎక్స్​ప్రెస్​, సింగరేణి, జీటీ, దానాపూర్​ తదితర ఎక్స్​ప్రెస్​ రైళ్లను  బెల్లంపల్లి రైల్వే స్టేషన్​, రెబ్బెన, అసిఫాబాద్​ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. మూడు గంటల తర్వాత రైల్వే ఆఫీసర్లు ఓఎస్డీ వైర్​ను పునరుద్ధరించడంతో ఆలస్యంగా రైళ్ల రాకపోకలు కొనసాగాయని  బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఇంచార్జి  మేనేజర్ పప్పు కుమార్, డిప్యూటీ స్టేషన్ మాస్టర్ అనిల్​ కుమార్​ తెలిపారు