
హైదరాబాద్, వెలుగు: లిపి లేకపోయినా ప్రజలు మాట్లాడే భాషల్లో ప్రముఖమైన భాష.. ‘గోర్ బోలి’ అని సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆదిమజాతుల తొలి తరం భాష అయిన దీనికి దేశ భాషల్లో చోటు లేకుండా పోయిందన్నారు. అందుకే ఈ భాషను దేశ భాషల్లో ఒకటిగా గుర్తించేందుకు వీలుగా దానిని షెడ్యూల్ 8లో కేంద్రం చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
గురువారం అసెంబ్లీలో ఆయన.. గోర్ బోలిని షెడ్యూల్ 8లో చేర్చే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. దేశంలో హిందీ తర్వాత పాన్ ఇండియా భాష అంటే గోర్బోలినేనన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి 11 రాష్ట్రాల్లో గోర్బోలి మాట్లాడుతారన్నారు.