నన్ను చంపేందుకు కుట్ర .. ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపణ

నన్ను చంపేందుకు కుట్ర .. ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపణ
  • నా ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు

మెహిదీపట్నం, వెలుగు: తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని గోషామహల్  బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్​ ఆరోపించారు. శనివారం అర్ధరాత్రి తన ఇంటి దగ్గర నలుగురు రెక్కీ నిర్వహించారని, ఇద్దరు పారిపోగా మరో ఇద్దరిని తన సెంట్రీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని ఓ వీడియోలో ఆయన చెప్పారు. వారి సెల్​ఫోన్లలో తన ఇంటి ఫొటోలు, తన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని తెలిపారు.

2010లోనూ ఐఎస్ఐ రెక్కీ నిర్వహించారని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా 2012లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ తో పాటు తన ఇంటిని కూడా రెక్కీ చేశారని, ఆ సమయంలో కూడా పోలీసులు దుండగులను అరెస్టు చేశారని వెల్లడించారు. ఇప్పుడు రెక్కీ చేసి దొరికిన వాళ్ల గురించి ఎంక్వైరీ చేయాలని వీడియోలో కోరారు.  

ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం: డీసీపీ 

ధూల్​పేటలోని ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద నలుగురు రెక్కీ నిర్వహించారని, వారిలో ఇద్దరిని పట్టుకున్నారని, ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని సౌత్  అండ్  వెస్ట్ జోన్  డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. ఆ ఇద్దరిలో బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ తోపాటు అదే ప్రాంతానికి చెందిన పెయింటర్  ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వీరు సెంట్రీని ‘‘రాజా సింగ్ ఉన్నాడా’’ అని ప్రశ్నించారని,  దీంతో సెంట్రీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని మంగళహాట్  పీఎస్​లో అప్పజెప్పారన్నారు.

వారిని విచారించగా బోరబండలో ఉన్న కొందరు తమను అవహేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే రాజా సింగ్​తో తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చామని పేర్కొన్నట్లు చెప్పారు. న్యూసెన్స్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల ఫోన్​లో  రాజా సింగ్​తో పాటు ఆయన ఇంటి ఫొటోలు, తుపాకీ, బుల్లెట్ల ఫొటోలు ఉన్నాయన్న ప్రచారం జరిగిందని, అది నిజం కాదన్నారు.