- మూసీ నిద్రకు ఎమ్మెల్యే రాజాసింగ్ దూరం
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీ
- చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన
- వాటి నుంచి దూరంగా వెళ్తానంటూ కామెంట్
- ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి గోషామహల్ నేత పురుషోత్తం
- మొదటి నుంచి కిషన్ రెడ్డి Vs రాజాసింగ్ గా వ్యవహారం
- అసెంబ్లీ ఎన్నికల వేళ సస్పెన్షన్ ఎత్తివేతపైనా టెన్షన్
- చివరి రోజు ఎత్తేసిన బీజేపీ జాతీయ నాయకత్వం
- ఎంపీ ఎన్నికల్లో మాధవీలత తరఫున ప్రచారం చేయలే
‘ఇక పై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటా. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటాను. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తా. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలనదే నా లక్ష్యం’.
హైదరాబాద్: బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్వహించిన మూసీ నిద్రకు గోషామహల్ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజాసింగ్ గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో ఆయన విడుదల చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. తాను చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని, వాటి నుంచి దూరంగా వెళ్తానని చెప్పడం కమలం పార్టీలో కలకలం రేపుతోంది. మూసీ నిద్ర ఉంటుందని ముందుగానే తెలుసుకున్న రాజాసింగ్ మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లారా..? అన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా గోషామహల్ కు చెందిన బీఆర్ఎస్ నేత పురుషోత్తం ఇవాళ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఆయన జాయిన్ అవుతున్నారని కామెంట్ చేశారా..? అన్నది అంతుచిక్కడం లేదు.
దూరం.. దూరం..
రాజాసింగ్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కీలక సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇస్తారని ఆశించి భంగపడ్డారు. తర్వాత సీనియర్ అయిన రాజాసింగ్ కు బీజేపీ శాసన సభా పక్ష నేత పదవిని ఇస్తారని ప్రచారం జరిగింది. వివిధ ఈక్వేషన్ల్ కారణంగా సీన్ చేంజ్ అయ్యింది. ఆ పదవి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని వరించింది. 2022లో ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు షాహినాథ్ గంజ్ పోలీసులు రాజాసింగ్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత గోషా మహల్ టికెట్ ఎవరికిస్తారనే చర్చ మొదలైంది. ఈ తరుణంలో ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయన పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అనూహ్యంగా నామినేషన్లదాఖలు ప్రారంభమయ్యాక రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను అధిష్టానం ఎత్తేసింది.
దీంతో పాటు ఆయనకే టికెట్ కేటాయించడంతో విజయం సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎంపీ టికెట్ ను మాధవీలత కు కేటాయించింది అధినాయకత్వం. ఈ సమయంలో ఆయన హైదరాబాద్ లో పురుషులే లేరా..? అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ సమయంలో ఆయన బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొన్న రోజూ ఆయన పక్కన లేకపోవడం గమనార్హం. కిషన్ రెడ్డికి, రాజాసింగ్ కు మధ్య విబేధాలున్నట్టు పార్టీలో అంతర్గతంగా చర్చ ఉండనే ఉంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డి నిర్వహించిన మూసీ నిద్రకు రాజాసింగ్ గైర్హాజరవటం చర్చనీయాంశమైంది. ఇదే తరుణంలో ఆయన విడుదల చేసిన వీడియో సందేశం హాట్ టాపిక్ గా మారింది.