![వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. బీజేపీ నుంచి పొమ్మంటే పోతా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్..](https://static.v6velugu.com/uploads/2025/02/goshamahal-bjp-mla-raja-singh-threatens-to-quit-party_a81FhuBPO3.jpg)
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. పార్టీలో వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అవసరం లేదని క్లారిటీ ఇస్తే ప్రాథమిక సభ్యత్వాన్నీ వదులుకునేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. గోల్కొండ–గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని తాను సూచించిన బీసీ నాయకుడికి కాకుండా ఎంఐఎం లీడర్ల వెంట తిరిగే వ్యక్తికి ఇచ్చారంటూ మండిపడ్డారు.
‘2014లో భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా.. ఇక నా వల్ల కావడం లేదు.. పార్టీకి నా అవసరం లేదు.. వెళ్లిపో అని అంటే ఇప్పటికిప్పుడే వెళ్లిపోవడానికి సిద్ధం.. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని నేను సూచించాను.. కానీ, ఎంఐఎంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తిని నియమించారు.
ఇదేంటని పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు.. ఆ జవాబుతో నా వెనుక జరుగుతున్న కుట్ర కోణం బయటపడింది. నేను ఇప్పటి వరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లతోనే పోరాటం చేస్తూ వచ్చాను. కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. జిల్లా అధ్యక్ష పదవి అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం ప్రతిచోటా జరుగుతుంది. కానీ, ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలి. జీవితంలో నేను ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నా.
ALSO READ | TG అని గుండెల మీద రాసుకున్న వ్యక్తి దేవేందర్ గౌడ్: CM రేవంత్
ప్రస్తుతం పార్టీలో కొందరిలా బ్రోకరిజం నేను నేర్చుకోలేదు. వాళ్ల కారణంగా ఈ రోజు పార్టీ వెనుకబడింది. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి. కానీ ఇలాంటి రిటైరైన వ్యక్తులు ఉంటే బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు’ అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ కామెంట్స్ బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి.
బీజేపీ ఇటీవలే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నాలుగు జిల్లాలకు ప్రెసిడెంట్లను ప్రకటించింది. గోల్కొండ గోషామహల్ జిల్లా అధ్యక్షుడిగా ఉమా మహేంద్ర, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా సీ గోదావరి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వల్లభు వెంకటేశ్వర్లు పేర్లను కేటాయించింది. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేంద్రను నియమించడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.