బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ చాక్నావాడిలో మరోసారి రోడ్డు కుంగింది. గతేడాది ఇలాగే రోడ్డు కుంగడంతో అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం రూ.1.20కోట్లు పెట్టి నాలా నిర్మించి, దానిపై రోడ్డు వేసింది. శనివారం అక్కడే మరోసారి రోడ్డు కుంగింది. బియ్యం బస్తాల డీసీఎం కూరుకుపోయి బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బియ్యం బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, జాంబాగ్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు ఎస్.ధన్రాజ్సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ వెంకటనారాయణ మాట్లాడుతూ రోడ్డు కింద నాలా ఉండడంతోనే కుంగిందన్నారు. గతంలో నాలా కుంగినప్పుడు ఈ రోడ్డుకు రిపేర్లు చేయకపోవడంతో తాజాగా ప్రమాదం జరిగిందన్నారు. క్రేన్ సాయంతో డీసీఎంను అక్కడి నుంచి తొలగించారు.
చాక్నావాడి రోడ్డును క్లోజ్చేశారు. గతేడాది ఇదే ప్రాంతాలో నాలా కుంగి పలువురు గాయపడ్డారని, వాహనాలు ధ్వంసమయ్యాయని స్థానికులు గుర్తుచేశారు. అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం రూ.1.20 కోట్లతో వెంటనే నాలాను తిరిగి నిర్మించి, రోడ్డు వేసిందని తెలిపారు. దాని పక్కనే ఉన్న మరో నాలాను తిరిగి నిర్మించి, రోడ్డు వేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తాజాగా సదరు రోడ్డు కుంగిందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ప్రభుత్వం పట్టించుకుని నాలాను నిర్మించి, రోడ్డు వేయాలని కోరుతున్నారు.