![బీజేపీలో రాజాసింగ్ హీట్.. మేమేంటో చూపిస్తామని వార్నింగ్](https://static.v6velugu.com/uploads/2025/02/goshamahal-mla-t-raja-singh-says--facing-harassment-within-bjp-since-2014_GehrU1ju5g.jpg)
- పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంట్
- తామెంటో చూపిస్తామని వార్నింగ్
- అంతా రెడ్డీలే అంటూ మెసేజ్.. ఆపై డిలీట్
- బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యమెందుకంటూ ఫైర్
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాము ప్రతిపాదించిన నేతను కాదని.. మరో వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. పార్టీకి తమ అవసరం లేదేమోనని అన్నారు. ఇకముందు తమ బలమేంటో చూపిస్తామని హెచ్చరించారు. ఏం జరుగుతుందో చూద్దామంటూ శుక్రవారం రాజాసింగ్ ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారగా.. రాజాసింగ్ మరోసారి బీసీ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. కొద్దినెలలుగా పార్టీపై రాజాసింగ్తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి అగ్ర నేతల సమావేశాలకు రాలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆయన స్టేట్ ఆఫీస్ కు వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఒకట్రెండు సార్లు మాత్రమే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. పార్టీ యాక్టివిటీస్ కూడా క్రమంగా తగ్గించేశారు. ఆయన్ను ఎల్పీ లీడర్‌గా పెట్టకపోవడం ఓ కారణమైతే, అగ్రనేతల తీరుపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా.. తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్‌గా తన కార్యకర్తను ప్రకటించకుండా.. వేరే వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి ఇవ్వడమేంటని బహిరంగంగానే ఆడియో రిలీజ్ చేశారు. ఏకంగా పార్టీకే వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ బీసీల పార్టీ అని చెబుతూనే.. స్టేట్ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడర్, మహిళా మోర్చా అధ్యక్షరాలిని రెడ్డినే చేశారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. ఇక బీసీలెక్కడ ఉన్నారని, ఉన్న బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు. ఆ వెంటనే మెసేజ్‌ను డిలీట్ చేశారు.
జిల్లా అధ్యక్షుల నియామకంపై లొల్లి
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నది. తొలి విడతలో 19 జిల్లాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించగా, తాజాగా మరో 4 జిల్లాలకు ప్రెసిడెంట్ల పేర్లను రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. మరో 15 జిల్లాలు పెండింగ్ లో ఉన్నాయి. గోల్కొండ జిల్లాకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించిన పేరును కాదని, వేరే వ్యక్తి పేరును ప్రకటించారు. దీంతో అసహనానికి లోనైన రాజాసింగ్.. పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం పెండింగ్ 15 జిల్లాల్లోనూ లొల్లి నడుస్తున్నది. తమ వర్గానికి చెందిన వారికే పదవి ఇవ్వాలంటూ నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జనవరి మొదటివారంలో ప్రకటిస్తామని చెప్పిన జిల్లా అధ్యక్షుల పేర్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో వెల్లడించలేదు.