Rain Alert: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగిన గోస్తానీ నది

Rain Alert: దంచికొడుతున్న వానలు..  ఉప్పొంగిన గోస్తానీ నది

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం (జులై 19)  నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో పలు జిల్లాల్లో వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు చేరడంతో గోదావరి, కృష్ణా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.  గోస్తానీ నది ఉగ్రరూపం దాల్చింది.   జుత్తిగ గ్రామంలోని  శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోకి..  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భాలయం ... నత్తరామేశ్వరం  ఆలయాల్లోకి భారీగా వరద నీరు చేరింది.  

గోస్తానీ నది వరద నీరు భారీగా ప్రవహించడంతో మముడూరు గ్రామంలో తూడు బాగా పేరుకుపోవడంతో మల్లిపూడి , నత్తరామేశ్వరం గ్రామాల మధ్య గోస్తాని నది   నీటి ప్రవాహం నిలిచిపోయింది. .  దీంతో కొన్ని  గ్రామాల్లో వర్షపు నీరు స్థంభించింది.  ఈదురు గాలులకు చెట్లు .. విద్యుత్​ స్థంభాలపై పడి విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.  చాలా ప్రాంతాల్లో సెల్​ ఫోన్​ సిగ్నల్స్​ కూడా అందకపోవడంతో ఫోన్​ కాల్స్​, ఇంటర్​ నెట్​ సేవలకు అంతరాయం కలిగింది. గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయి.

కొవ్వూరు నియోజకవర్గం మద్దూరులంక గ్రామం నీట మునిగింది. కొవ్వాడ కాలువ ఉగ్రరూపం దాల్చింది. తాళ్లపూడి మండలం పోచవరం, తాడిపూడి, గజ్జరం, అన్నదేవరపేట, పెద్దేవం, తిరుగుడుమెట్ట, మలకపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో నిడదవోలు మండలంలోని 12 గ్రామాలు వరద నీటితో వణుకుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 48వేల605 హెక్టార్లలో వరి నాట్లు పూర్తవగా 7వేల 965 హెక్టార్లలో పంట నీట మునిగింది. 18 మండలాల్లోని 178 గ్రామాల్లో 9వేల613 మంది రైతులకు చెందిన వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

విద్యుత్‌ సౌకర్యం లేక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం కొవ్వొత్తులు, బియ్యం కూడా ఇవ్వలేదు. నీట మునిగిన గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏలూరు జిల్లాలోని పోలవరం ఏజెన్సీ ఏరియా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.