చుట్టూ అడవి.. కనుచూపుమేరంతా పచ్చదనం.. అందమైన జలపాతాలు.. ఎత్తైన కొండలు.. ఇలాంటి ప్రదేశాల్లో ఉండటమంటే టూరిస్టులకు లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియెన్స్. ఈ అనుభూతిని ఇచ్చే ప్లేస్‌లు మన తెలంగాణలో బోలెడన్ని ఉన్నాయి. వాటిలో జహీరాబాద్ దగ్గర్లో ఉన్న ‘గొట్టం గుట్ట’ ఒకటి. ‘తెలంగాణ ఊటీ’గా పేరుపొందిన ‘గొట్టం గుట్ట’ ఈ సీజన్‌లో చూడాల్సిన బెస్ట్ ప్లేస్.
వీకెండ్స్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపి రాగలిగే టూరిస్ట్ ప్లేస్ ‘గొట్టం గుట్ట’. ఇక్కడి అందమైన అడవులు, జలపాతాలు, కొండలు, వైల్డ్‌లైఫ్ శాంక్చురీ.. అన్నీ కలిపి టూరిస్ట్‌లకు మంచి అనుభూతిని ఇస్తాయి. గ్రీనరీ, నేచురల్ బ్యూటీతో ఆకట్టుకునే ఈ ప్లేస్‌ను ‘తెలంగాణ ఊటీ’ అని కూడా అంటారు. ఇక్కడికి వెళ్లడానికి చేసే రోడ్ జర్నీ కూడా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని టూరిస్ట్‌లు చెబుతుంటారు. ట్రెక్కింగ్, క్యాంపింగ్‌కు కూడా ‘గొట్టం గుట్ట’ ఫేమస్. ఇక్కడికి వెళ్లేందుకు వర్షాకాలం బెస్ట్ సీజన్. ఇది తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉంది.
ఇవే స్పెషల్ అట్రాక్షన్స్
కర్ణాటకలో ప్రవహించే భీమ నదికి దగ్గర్లో ఉంటుంది గొట్టం గుట్ట. దగ్గర్లో చంద్రపల్లి అనే ఊళ్లో రిజర్వాయర్ ఉంది. టూరిస్ట్‌లు ఈ రిజర్వాయర్‌కు కూడా వెళ్లొచ్చు. గొట్టం గుట్టలో కొండల నుంచి కిందికి జారే జలపాతాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గొట్టంగుట్ట’కు పది కిలోమీటర్ల దూరంలో జాడి మల్కాపూర్ దగ్గర ఉన్న జలపాతం ఎక్కువమంది టూరిస్టులని ఆకర్షిస్తుంది.
దగ్గర్లోనే ఉన్న చించోలి వైల్డ్‌లైఫ్ శాంక్చురీని కూడా చూడొచ్చు. ఎన్నో అడవి జంతువులు కనిపిస్తాయి ఇక్కడ. ఈ ప్రాంతం దగ్గర్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పార్కులు, దేవాలయాలు కూడా ప్రధాన ఆకర్షణలు. ఒక రోజంతా ప్రకృతి ఒడిలోనే ఉండాలనుకుంటే క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు. ట్రెక్కింగ్ చేసేందుకు బాగుంటుంది. కిలోమీటర్ల పొడవునా పచ్చదనం, చిన్న సరస్సులు, కొండలు వంటి ప్రకృతి తప్ప మరోటి కనిపించని ఈ ప్రాంతాన్ని చూడటం కచ్చితంగా మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో విజిట్ చేయొచ్చు.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ‘గొట్టం గుట్ట’ దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండున్నర గంటల ప్రయాణం. జహీరాబాద్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం. రోడ్డు జర్నీ చేసి ఇక్కడికి వెళ్లొచ్చు. ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకుంటే దగ్గర్లోని జహీరాబాద్‌తో పాటు, కర్ణాటకలోని గుల్బర్గాలో హోటల్స్, రిసార్ట్స్ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్లినా సౌకర్యంగానే ఉంటుంది.