పెద్దపల్లి, వెలుగు: బీజేపీ పటిష్టత కోసం పాటుపడుతానని ఆ పార్టీ లీడర్ గొట్టిముక్కుల సురేశ్ రెడ్డి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన అనంతరం సురేశ్‌రెడ్డి మొదటిసారిగా పెద్దపల్లికి వస్తున్నందున శుక్రవారం బీజేపీ లీడర్లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సుల్తానాబాద్ నుంచి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్‌లో దివంగత కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెద్దపల్లిలో ప్రారంభించిన ర్యాలీ బంధంపల్లిలోని స్వరూప గార్డెన్ వరకు సాగింది. అనంతరం సురేశ్‌రెడ్డి మాట్లాడారు. బీజేపీలో చేరడానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామికి కృతజ్క్షతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు స్థానిక బీజేపీ సీనియర్ లీడర్లు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రావు సూచనలతో కార్యకర్తలాగా పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో లీడర్లు సజ్జాద్, ఉనుకొండ శ్రీధర్, బాలసాని సతీశ్, ఎలిగేడు శ్రీనివాస్, కూకట్ల నాగరాజు, గజభీంకార్ పవన్, చిట్టవేణి సదయ్య, బుర్ర సతీశ్‌గౌడ్, భూసారపు సంపత్, గుడ్ల సతీశ్, ఎనగందుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవ కోసం కరాటే
కరీంనగర్ సిటీ, వెలుగు: కరాటేను మెడల్స్ కోసం కాకుండా సమాజ సేవ కోసం పిల్లలకు నేర్పించాలని బీజేపీ స్టేట్చీఫ్బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‍షిప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడి కరాటేకు క్రీడా గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. అనంతరం కరాటేలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన దీప్తిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేఈ నేత కొండా విశ్వేశ్వర్‍రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, టోర్నమెంట్ అధ్యక్షుడు రజ్నీశ్చౌదరి, చీఫ్ ఆర్గనైజర్ పి. ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘టీఆర్ఎస్ పాలనను ప్రశ్నిస్తే జోపుడే’
తిమ్మాపూర్, వెలుగు: అడ్డమైన వాళ్లు టీఆర్ఎస్ పాలనను విమర్శిస్తే కట్టెపట్టి జోపాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లిలో లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దసరాలోగా సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేస్తానని హామీ ఇచ్చారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ లీడర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వనిత, జడ్పీటీసీ శైలజ, వైస్ ఎంపీపీ ల్యాగల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలో అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం మెట్ పల్లి బల్దియా 26 వార్డులో 1,043 మందికి మంజూరైన పింఛన్‌మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. పింఛన్‌మంజూరు కానివారు 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం 16 మందికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జగిత్యాల: వృద్ధులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మపూర్, పొలాస, గుట్రాజ్ పల్లి, అనంతారం, గుల్లపేట్ గ్రామాలలో 450 మందికి కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్‌ను శుక్రవారం జడ్పీ చైర్ పర్సన్ వసంతతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాధ నాయకులు పాల్గొన్నారు.
ఇంజక్షన్ వికటించి రైతుకూలీ మృతి
జమ్మికుంట, వెలుగు: కడపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ రైతు కూలీ ఇంజక్షన్ వికటించి మృతి చెందాడు. వివరాలు.. వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన అమ్మ స్వామి(35) కడుపునొప్పితో జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం అడ్మిట్ అయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్స్వామికి ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి చనిపోయాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆసుపత్రి సిబ్బంది.. స్వామి పరిస్థితి విషమంగా ఉంది, వరంగల్ తరలించాలని మృతుని కుటుంబీకులకు తెలిపారు. ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో గంట తర్వాత స్వామి చనిపోయాడని చెప్పారు. దీంతో మృతుడి భార్య భార్య విజయ, కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. స్వామి కుటుంబం రోడ్డున పడిందని, రూ.40లక్షల పరిహారం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. కాగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని జమ్మికుంట పోలీసులు తెలిపారు.
అంగన్వాడీల్లో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్
సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: గ్రామాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా సెప్టెంబర్నుంచి ప్రతినెలా రెండో శనివారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మహిళ, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహించాలని, పంచాయతీ సెక్రెటరీలు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ కు కలెక్టర్సూచించారు. జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 36 వేల మంది పిల్లలకు 7వ తేదీలోగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డీఆర్ డీఓ గౌతం రెడ్డి, డీపీఓ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సీడీపీఓ ఎల్లయ్య,అలేఖ్య పాల్గొన్నారు.
‘రైతులపై కేసులు పెట్టడం అన్యాయం’
వీర్నపల్లి, వెలుగు : మండలంలోని అడవి పదిర గ్రామానికి చెందిన ఏడుగురు దళిత, మహిళా పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని వీర్నపల్లిలో శుక్రవారం ప్రజా సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చి కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పోడు రైతుల పై అటవీశాఖ అధికారుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు నిలిపేయాలన్నారు. ఎస్ఐ అపూర్వ రెడ్డి ధర్నా స్థలానికి చేరుకొని నాయకులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్, ఈసంపల్లి కొమురయ్య, జింక పోచయ్య, మల్లేశం, ప్రకాష్, నాగరాజు, మనోజ్, నరేష్, దినేష్, తిరుపతి పాల్గొన్నారు.