రాజకీయాల్లో గౌడ్స్​కు ప్రాధాన్యం ఇవ్వాలి

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో 14 శాతం జనాభా ఉన్న గౌడ్స్​కు రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణ గౌడ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  అన్ని రాజకీయ పార్టీలు  తమకు  10 అసెంబ్లీ, 3 లోక్ సభ,4 ఎమ్మెల్సీ,1 రాజ్యసభ సీట్  కేటాయించాలని డిమాండ్ చేసింది. బుధవారం బేగంపేట టూరి జం ప్లాజాలో తెలంగాణ గౌడ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గౌడ నేతలు  పలు తీర్మానాలు చేసి ఆమోదించుకున్నారు. అనంతరం తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ.. గౌడ్ కులస్తుల  అభివృద్ధికి  కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక టైమ్​లో గౌడ్స్​కు ఇచ్చిన ద్విచక్ర వాహనాల పంపిణీ హామీని నెరవేర్చాలని కోరారు. వైన్ షాపుల నిర్వ హణకు అందిస్తున్న 15% రిజర్వేషన్​ను 25 శాతానికి పెంచాలన్నారు.  బీసీలకు లక్ష ఆర్థిక సాయంలో  గౌడ్స్​ను చేర్చాలన్నారు.

ALSO READ: 120 జీబీపీఎస్​ స్పీడ్​తో  ఇంటెల్​ థండర్​బోల్డ్​ కనెక్టర్​

వృత్తిపరంగా ప్రమాదాలను నివారించేందుకు చెట్లు ఎక్కే రక్షణ పరికరాలు అందించాలని, ప్రమాదవశాత్తు మరణించిన గౌడ కులస్తులకు ఇచ్చే 5 లక్షల పరిహారాన్ని 10 లక్షల పెంచాలన్నారు. తాటి, ఈత, వనాల పెంపకం కోసం ప్రతి సొసైటీకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. వచ్చే నెలలో లక్ష మందితో గౌడ గర్జన నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ రావు గౌడ్​ పేర్కొన్నారు.