తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వస్తే వారి జీవితానికి ఢోకా ఉండదని, ఆ వృతిపై చిన్నప్పటి నుంచే ఆసక్తిని ఏర్పర్చుకుంటారు. వారు ఏదైనా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడమే జీవితాశయంగా పెట్టుకొని చదువుతారు. ఆ దిశగా ఇంటర్ చదివినవాళ్ళు టీటీసీ వంటి డిప్లొమా కోర్సులు, అలాగే డిగ్రీ లేదా పీజీ చదివినవాళ్లు బీఎడ్ వంటి కోర్సులు చేస్తారు. వేరే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ, జీవితంలో తొందరగా స్థిరపడడానికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి మించింది లేదని తెలంగాణలో ఇప్పటికీ నమ్ముతారు.
సమాజంలో గౌరవం
సమాజంలో ఉపాధ్యాయులకు మంచి గౌరవం లభిస్తోంది. అన్నింటికంటే మించి ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉండటం, వాటిని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతో అభ్యర్థుల్లో ఆశలు నెలకొన్నాయి. అయితే, 2011లో కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయ విద్యా కోర్సులు చేసినవారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్-) ఉత్తీర్ణులై ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.
ఉపాధ్యాయ ఉద్యోగ ఎంపికకు టెట్ లో పొందిన మార్కులకు 20 శాతం వెయిటేజీ, డీఎస్సీ రాత పరీక్షలో పొందిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఈ రెండు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. దీనికోసం వారు నెలల తరబడి రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు.
ప్రభుత్వబడుల ప్రస్తుత దుర్గతికి కారకులెవరు?
ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ పడిపోతున్న విద్యార్థుల నమోదు..రాబోయే రోజుల్లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు అమాంతం క్షీణిస్తాయని హెచ్చరిస్తోంది. తెలంగాణలో తల్లిదండ్రులందరూ వారి పిల్లలను చదివించడానికి ప్రభుత్వ బడులకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ప్రైవేట్ బడుల వైపే మొగ్గుచూపితే మున్ముందు ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బడులుండవు. ఒకవేళ ఉన్నా వాటిలో ఖాళీ పోస్టులుండవు. ఖాళీలున్నా అడగడానికి నిరుద్యోగ యువతకు అంత బలముండదు.
కేవలం ప్రభుత్వాలను విమర్శిస్తూ, ప్రభుత్వ టీచర్లను వారి పిల్లలను ఎందుకు ప్రభుత్వ బడుల్లో చదివిపించరని వేలెత్తిచూపే ముందు సద్విమర్శ చేసుకోవాలి. మన సమాజంలో మనతోపాటు మనకు తెలిసినవాళ్లల్లో ఎంతమంది మన పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించామని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతెందుకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అప్లై చేసినవారిలో ఎంతమంది వారి పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపిస్తున్నారు? ఇలా అడిగితే స్కూల్ ఎంపిక అనేది పూర్తిగా మా వ్యక్తిగతం, మా స్వేచ్చ, మా ఇష్టమని అంటారు.
విద్య మార్కెట్ వస్తువుగా మారింది
నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల కోసం ప్రభుత్వం కొన్ని బడులను ఖచ్చితంగా నడపాలి. అది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ, కూలీనాలీ చేసుకొనే పేదవారి నుంచి కోటీశ్వరుల దాకా అందరూ ప్రైవేటు స్కూళ్లనే ఎంచుకుంటే ఏటా ప్రభుత్వ బడులు తగ్గుతాయి కానీ పెరగవు కదా! ఒకప్పుడు సేవా రంగంలోనున్న విద్య.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలవల్ల, తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను విడిచిపెట్టడం మూలంగా విద్య ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువుగా మారిపోయింది.
సమాజమే ప్రభుత్వ స్కూళ్లను పతనావస్థకు తీసుకొచ్చి, వాటిలో విద్యార్థులు లేకున్నా ఉద్యోగాలు వేసి వాటిని రక్షించాలని మొత్తుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల అధోగతికి ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు ఇద్దరూ కారకులే. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కోరుకోవడం సహజం. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితేనే ఆ ఉద్యోగం సాధ్యమనే ఆలోచన అందరిలోనూ రావాలి.
డా. శ్రీరాములు గోసికొండ,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ