- జనగామ మున్సిపాలిటీలో కీలక ఆఫీసర్లంతా ఇన్‌చార్జులే..
- డీఈకి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు
- మూడు రోజులే అందుబాటులో ఉంటున్న టీపీవో, ఏఈ
- అస్తవ్యస్తంగా మారిన పాలన
జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీలో కీలక అధికారులంతా ఇన్‌చార్జులే ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఒక్కో అధికారి రెండు చోట్ల, రెండు రకాల డ్యూటీలు చేయాల్సి వస్తుండడంతో వారు ఆఫీస్‌కు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు రారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వివిధ పనులపై మున్సిపల్ ఆఫీస్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కమిషనర్ నుంచి ఏఈ వరకు అందరూ ఇన్‌చార్జులే...
జనగామ మున్సిపల్ ఆఫీస్ మొత్తం ఇన్‌చార్జుల పాలనలోనే కొనసాగుతోంది. కమిషనర్ మొదలుకొని టీపీవో, శానిటరీ ఇన్స్‌పెక్టర్, ఏఈలు సైతం ఇన్‌చార్జులే ఉన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ జంపాల రజిత గత నవంబర్ 20న ఏసీబీకి పట్టుబడింది. దీంతో ఇదే ఆఫీస్‌లో డీఈగా పనిచేస్తున్న చంద్రమౌళికి కమిషనర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
ఈయన కాసేపు కమిషనర్ ఛాంబర్‌లో కూర్చుంటే మరికొంతసేపు డీఈ ఛాంబర్‌లో కూర్చోవాల్సి వస్తోంది. మరో వైపు ఫీల్డ్ విజిట్‌కు కూడా వెళ్లాల్సి వస్తుండడంతో ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక కీలకమైన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రశాంతి జనగామతో పాటు హైదరాబాద్‌లోనూ విధులు నిర్వహిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో జనగామలో డ్యూటీ చేస్తే మిగిలిన రోజులు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.
జనగామకు కేటాయించిన మూడు రోజుల్లో ప్రభుత్వ సెలవేమైనా ఉన్నా, అత్యవసరం ఉండి ఆమె సెలవు పెట్టినా అంతే సంగతులు. వారానికి ఒకటి, రెండు రోజులే అందుబాటులో ఉంటుండడంతో పట్టణంలో ఇండ్ల నిర్మాణానికి వచ్చిన అర్జీలన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి. మరో వైపు ఏఈ మహిపాల్ కూడా జనగామతో పాటు మెట్‌పల్లి మున్సిపల్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు.
ఆయన కూడా సోమ, మంగళ, బుధవారాల్లో జనగామలో, మిగిలిన రోజుల్లో మెట్‌పల్లిలో డ్యూటీ చేస్తున్నారు. అధికారులంతా వారంలో కొన్ని రోజులే జనగామలో అందుబాటులో ఉంటుండడంతో పట్టణ పరిధిలో జరుగుతున్న వివిధ డెవలప్‌మెంట్ వర్క్స్‌పై పర్యవేక్షణ కరువైంది. జనగామ జిల్లా కేంద్రం కావడంతో స్థానికంగా నెలకొన్న సమస్యలు వెంట వెంటనే కలెక్టరేట్‌కు చేరుతుండడంతో ఇక్కడ పనిచేసే ఆఫీసర్లపై ఒత్తిడి పెరుగుతోంది.
మున్సిపాలిటీపై అడిషనల్ కలెక్టర్ ఫోకస్
జనగామ మున్సిపాలిటీపై అడిషనల్ కలెక్టర్ పర్మర్ పికేశ్ కుమార్ దృష్టి పెట్టారు. పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ శానిటేషన్ నిర్వహణ తీరును పరిశీలిస్తూ ఫీల్డ్ స్టాఫ్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఆయన ఏ కాలనీకి వస్తున్నారో ముందుగానే తెలుసుకుంటున్న స్టాఫ్ అలర్ట్ అవుతున్నారు. మిగతా వార్డుల్లో పరిస్థితి షరా మామూలుగానే మారింది.
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
జనగామ పట్టణంలో 30 వార్డులు ఉండగా, సుమారు లక్షకుపైగా జనాభా ఉన్నారు. ఏ వార్డులో చూసినా చెత్త సేకరణ అధ్వానంగా మారింది. ఇదే విషయంపై జనరల్ బాడీ మీటింగ్ జరిగిన ప్రతీసారి కౌన్సిలర్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాము చెప్పినా ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మున్సిపాలిటీలో అత్యంత కీలకమైన శానిటేషన్ విభాగానికి ఆఫీసర్ లేరు.
ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆఫీస్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మధుకు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన అజమాయిషీని కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడంతో శానిటేషన్ నిర్వహణ మొక్కుబడిగా మారింది. ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ ఆఫీసర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.