కరీంనగర్ కార్పొరేషన్ లో పాలన అస్తవ్యస్తం

కరీంనగర్ కార్పొరేషన్ లో పాలన అస్తవ్యస్తం
  • కీలక ఆఫీసర్లంతా సెలవులో... ఇన్​చార్జిల చేతుల్లో విభాగాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పాలన గాడి తప్పింది.  కీలకమైన పోస్టుల్లో ఇన్ చార్జీలే దిక్కయ్యారు. కమిషనర్, డిప్యూటీ సిటీ ప్లానర్ సహా కీలకమైన ఆఫీసర్లంతా సెలవులో వెళ్లడంతో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అంతేగాక పలువురు ఆఫీసర్లు ట్రాన్స్ ఫర్ కావడంతో వారి స్థానంలో ఇన్ చార్జీలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కీలక ఫైళ్లన్నీ పెండింగ్ లో ఉపడుతున్నాయి.  మరోవైపు స్మార్ట్ సిటీ, ఇతర అభివృద్ధి పనుల్లో, పన్నుల వసూళ్లలో పలువురు ఆఫీసర్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ కరీంనగర్  నగరపాలక సంస్థలో  పలు పనులపై మంగళవారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది. 

ఏ డిపార్ట్​మెంట్​లో చూసినా ఇన్​చార్జిలే 

  •     మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ఈ నెల  15 నుంచే 15 రోజులపాటు సెలవులో వెళ్లారు. దీంతో ఆయన బాధ్యతలు డిప్యూటీ కమిషనర్ స్వరూపా రాణి నిర్వర్తిస్తున్నారు. 
  •     కార్పొరేషన్ టౌన్  డిప్యూటీ సిటీ ప్లానర్(డీసీపీ) సుభాష్ నెలరోజుల సెలవులో వెళ్లారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ భానుచందర్ ఇన్​చార్జిగా గా వ్యవహరిస్తున్నారు. 
  •     మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి హెడ్ గా పని చేసిన సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్ఈ) నాగమల్లేశ్వర్ రావు సర్కార్ మారగనే ట్రాన్స్ ఫర్ పై వెళ్లిపోయారు. జీతం లేకపోయిన పని చేయడం, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో టెండర్లు కాకుండానే కార్పొరేటర్లకు ఇష్టారాజ్యంగా పనులు అప్పగించారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. ఆయన స్థానంలో ఎస్ఈగా ఎవరూ రాకపోవడంతో ఈఈ మహేందర్ ఇన్​చార్జి ఎస్ఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
  •     ఇదే విభాగంలో ఈఈగా పనిచేసిన కిష్టప్ప ట్రాన్స్ ఫర్ పై వెళ్లగా జగిత్యాల మున్సిపాలిటీలో డీఈఈగా పనిచేస్తున్న రొడ్డ యాదగిరికి ఇన్​చార్జి ఈఈగా బాధ్యతలు అప్పగించారు. 
  •     అలాగే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డీఈ మసూద్  అలీపై ట్రాన్స్ ఫర్ పై వెళ్లిపోయారు.
  •     మున్సిపల్ కార్పొరేషన్ లో మరో కీలకమైన పోస్టు సానిటరీ సూపర్ వైజర్ గా రాజమనోహర్ పని చేసేవారు. ఆయనపై పేకాట కేసులతోపాటు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా ఇటీవల సెలవులో వెళ్లారు. అసిస్టెంట్ కమిషనర్  శానిటేషన్ బాధ్యతలు చూస్తున్నారు. 
  • స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతాలోపాలు.. 
  • హౌసింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలచ్చారని ఫిర్యాదులు అందగా, గత నెలలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఈ ఎంక్వైరీ రిపోర్టుల్లో నాణ్యత లోపించినట్లు తేలింది. అయితే బాధ్యులను మాత్రం ఇంతవరకు గుర్తించలేదు. టవర్ సర్కిల్ ఏరియాలో స్మార్ట్ సిటీలో భాగంగా సీసీ రోడ్డు, డ్రైనేజీలు పూర్తి చేసి టైల్స్ వేశారు. వేసిన రెండు నెలల్లోనే టైల్స్ పోవడం, మళ్లీ తవ్వారు. ఇవేగాక ప్రధానంగా 9 అంశాలపై  ప్రత్యేక దృష్టి 
  • పెట్టనున్నట్లు సమాచారం. మానేర్ రివర్ ఫ్రంట్, సీఎం అస్యూరెన్స్ ప్లాన్ గ్రాంట్లు, స్మార్ట్ సిటీ పనులు(గీతాభవన్ తో పాటు పలు జంక్షన్ల నిర్మాణాలు), జనరల్ ఫండ్స్ తో  చేపట్టిన పనులు, మెప్మా, 24/7 నీటి సరఫరా కోసం చేపట్టిన పనులు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ(ఆర్థిక వనరుల పెంపుదల),  ఇంజనీరింగ్ పనులపై మంత్రి పొన్నం రివ్యూ నిర్వహించనున్నారు. అంతేగాక మున్సిపాల్టిలోని పలు విభాగాల్లో ఉన్నతాధికారులు లీవ్ లు, ట్రాన్స్ ఫర్లపై ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే అంశాలపై ఆరా తీయనున్నారని తెలిసింది.