- చైర్మన్, వైస్ చైర్మన్మధ్య ఆధిపత్య పోరు
- ప్రజా సమస్యలు గాలికొదిలేసి తగువులాట
- చిన్నిచితకా పనులు, ఇండ్ల నిర్మాణాల పర్మిషన్లకు సిబ్బంది వసూళ్లు
- రియల్ అవతారమెత్తిన కొందరు కౌన్సిలర్లు
వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలో పాలన గాడి తప్పింది. పాలకవర్గంలో తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో పాలన పడకేసింది. వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నా పాలకవర్గం పట్టించుకునే పరిస్థితిలో లేదన్న ఆరోపణలున్నాయి. పాలకవర్గంలో విభేదాలతో ప్రజా సమస్యలు గాలికొదిలేశారు.
అవినీతిని పట్టించుకునేవారేరి..
మున్సిపాలిటీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందిన కాడికి దోచుకుంటున్నా పట్టించుకునేవారే లేరు. ఇటీవల నల్లా బిల్లులు, ఆస్తి పన్నులకు సంబంధించి సుమారు రూ.8లక్షల 50 వేలు మున్సిపల్ ఖాతాలో జమచేయకుండా సిబ్బంది తమ సొంతానికి వాడుకున్నారు. మున్సిపల్ చెత్త ట్రాక్టర్లు, స్వీపింగ్ మిషన్, డీజిల్ బిల్లుల పేరుతో మరో రూ.10 లక్షల దాకా నిధులు పక్కదారి పట్టాయి. హరితహారం మొక్కల కొనుగోళ్లు, పెంపకం పేరుతో అధికార పార్టీ కౌన్సిలర్లతో కలిసి అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శించారు. రోడ్లపై ఆక్రమణల తొలగింపు టైంలోనూ జేసీబీల వినియోగం పేరుతో పెద్దఎత్తున నిధులను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీలో చిన్న చిన్న పనులకు, ఇంటి నిర్మాణాలకు డబ్బులు డిమాండ్ చేస్తూ పేద, మధ్య తరగతి వారిని సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు. అనుమతులు లేకుండా నాలుగైదు అంతస్తుల భవనాలు, ప్రమాదకరంగా సెల్లార్లు నిర్మిస్తున్నా సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని అధికార పక్షంలోని ఓ వర్గం చెబుతోంది. పట్టణంలో వీధిలైట్లు, శానిటేషన్, తాగునీటి సరఫరా వంటి వాటిపై కూడా అధిక బిల్లులు చేసుకుంటున్నారని కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు.
రియల్ ఎస్టేట్పై కౌన్సిలర్ల దృష్టి
వనపర్తి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో కొందరు కౌన్సిలర్లు, అధికార పార్టీ నేతలు భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేయడం మొదలుపెట్టారు. తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూల్స్ ను తుంగలో తొక్కుతున్నారు. వెంచర్ల సమీపంలో ఉండే ప్రభుత్వ భూములు, నాలాలను కబ్జాలు చేస్తున్నారు. వెంచర్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కౌన్సిలర్లు పార్ట్నర్లుగా ఉంటున్నారు. దీంతో కౌన్సిలర్ల అక్రమాలపై జిల్లా అధికారులు నోరు మెదపడం లేదు. నాగవరం తాండ, చీమనగుంటపల్లి ప్రాంతాలలో ప్రభుత్వ భూమి, నాలాను ఆక్రమించుకుంటూ పలువురు వెంచర్లు వేశారు. రోడ్ల కోసం గుట్టలు, వాగులు, వంకలను అనువుగా మార్చుకుంటున్నారు. వెంచర్ల కోసం ఇష్టారాజ్యంగా గుట్టల నుంచి మట్టి తరలిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు వచ్చినా మున్సిపల్ అధికారులు గానీ, పాలకవర్గంగానీ పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యలను కౌన్సిలర్లు గాలికి వదిలేశారు. ఇప్పటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సక్రమంగా అందడం లేదు. చాలా కాలంగా డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం లేక జనం ఇబ్బందిపడుతున్నారు.
కాంట్రాక్టుల కోసం కౌన్సిలర్ల కొట్లాట...
గెలిచేందుకు ఒక్కో కౌన్సిలర్ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తిరిగి ఆ డబ్బు రాబట్టుకునేందుకు తమకే కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలని అధికార పార్టీ కౌన్సిలర్లు తరచూ చైర్మన్, వైస్ చైర్మన్ లతో వాదనకు దిగుతున్నారు. మున్సిపాలిటీలో ఉన్న జనరల్ ఫండ్ అంతా రోడ్ల విస్తరణకే ఖర్చు చేస్తుండడంతో ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని కౌన్సిలర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. చైర్మన్ , వైస్ చైర్మన్ సైతం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొని పనులు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో వనపర్తి మున్సిపాలిటీలో పాలన పూర్తిగా గాడి తప్పిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.