తెలంగాణలో అన్నిట్లో ఇన్​చార్జుల పాలన.!

తెలంగాణలో  అన్నిట్లో ఇన్​చార్జుల పాలన.!
  • నిరుడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలకవర్గాల గడువు
  • తర్వాత పరిషత్​లు, మున్సిపాలిటీలు.. ఇప్పుడు సహకార సంఘాలు 
  • ప్యాక్స్​లకూ ప్రత్యేక అధికారులను నియమించే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలకవర్గాల గడువు ముగియగా.. ఇప్పుడు ఆ లిస్టులో సహకార సంఘాలు కూడా చేరాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్​) పాలకవర్గాల గడువు శుక్రవారంతో ముగుస్తున్నది. పంచాయతీలు, పరిషత్​లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే ఇన్ చార్జుల పాలన కొనసాగుతుండగా.. సహకార సంఘాల బాధ్యతలను కూడా ప్రత్యేకాధికారులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. సాధారణంగా పాలకవర్గం గడువు ముగిసే లోపే ఎన్నికల ప్రక్రియ మొదలుకావాలి. ఇందులో భాగంగా కొత్త సభ్యుల చేరికలు, ఓటర్ల జాబితాల తయారీ చేపట్టాలి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి  ఆదేశాలు జారీ కాలేదు. 

ఈ నేపథ్యంలో సహకార సంఘాలకు సైతం స్పెషల్ ఆఫీసర్లను నియమించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పోయినేడాది ఫిబ్రవరి 1న గడువు ముగిసింది. దీంతో ఎంపీడీవోలు,  తహసీల్దార్లు, ఎంఈవోలు, ఏవోలు తదితర గెజిటెడ్​స్థాయి అధికారులను పంచాయతీలకు ఇన్​చార్జులుగా ప్రభుత్వం నియమించింది. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు పోయినేడాది జులై మొదటివారంలో.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలకు గత నెల 26న గడువు ముగిసింది. వీటిల్లో ఆర్డీవోలు, అడిషన్​కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఇన్​చార్జులుగా కొనసాగుతున్నారు. కార్పొరేషన్లకు కలెక్టర్లు ఇన్​చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో అధికారికి ఐదారు పంచాయతీలు, మండల పరిషత్​లు, మున్సిపాలిటీలు ఉండడంతో.. వాటి నిర్వహణ చూసుకోవడం కష్టంగా మారింది. సమస్యలు పేరుకుపోతున్నాయని, అభివృద్ధి పనులతో పాటు బిల్లులు పెండింగ్​పడ్తున్నాయని, ఆస్తి పన్నుల టార్గెట్​రీచ్​కావడం లేదని సిబ్బంది అంటున్నారు. 

ALSO READ : ఇసుక దందాకు చెక్..​ సీఎం వార్నింగ్​తో కదిలిన అధికారయంత్రాంగం

ప్యాక్స్ ల గడువు పొడిగింపు లేనట్టే!

సహకార సంఘాలకు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించారు. తాజాగా ప్యాక్స్ లతో పాటు డీసీఎంలు, డీసీసీబీల గడువు కూడా ముగియనుంది. వీటి గడువు పొడిగించే యోచనలో ప్రభుత్వం లేనట్టు తెలుస్తున్నది. ప్యాక్స్, డీసీఎంలు, డీసీసీబీలకు ప్రత్యేక అధికారులను నియమించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.