బోరుబావి… మింగేస్తూనే ఉంది

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడ్డ సంఘటనతో మరోసారి బోరుబావుల ఇష్యూ తెరమీదకు వచ్చింది. చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బోరుబావుల్లో పడి ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు మనదేశంలో తరచూ జరుగుతున్నాయి. బోరు బావులకు సంబంధించి మెజారిటీ చావులన్నీ చట్టాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే జరుగుతున్నాయి. బావులను పూడ్చకుండా వదిలేయడమే చిన్నారుల ప్రాణాలను తీస్తోంది.

వాల్టా చట్టం ఏం చెబుతోంది ?

బోరు బావులు తవ్వకంపై  మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది. అదే వాల్టా చట్టం. భూగర్బ జలాలను కాపాడుకోవడం కోసం 2002 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ‘ వాటర్ , ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ ’ గా ఈ చట్టానికి పేరు పెట్టారు. ఈ చట్టం ప్రకారం బోరు బావులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బోరు బావులకు సంబంధించి ఈ చట్టం అనేక నిబంధనలు తయారు  చేసింది.

ఎవరైనా సరే బోరు బావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. బోరు వేసే ప్రాంతం, సర్వే నెంబరు ఆధారంగా రెవెన్యూ సిబ్బంది పరిశీలించాలి. తర్వాత ఆ అప్లికేషన్ ను భూగర్భ జలవనరుల శాఖకు పంపాలి. అక్కడి టెక్నికల్ ఆఫీసర్ సర్వే చేసి ఆ ప్రాంతంలో నీళ్లు పడే అవకాశం ఉన్నదని సర్టిఫికెట్ ఇస్తేనే ఫైనల్ గా బోరు బావి తవ్వుకోవడానికి  పర్మిషన్ వచ్చినట్లు. అంతేకాదు బోరు బావిలో నీళ్లు పడకపోతే బావిని అలా గాలికి వదిలేయకూడదు. బోరు బావిని పూర్తిగా పూడ్చివేయాలి. రిపేర్ల కోసం ఎప్పుడైనా తీసివేసినా,  మళ్లీ చాలా జాగ్రత్తగా కప్పేయాలి.  వాల్టా చట్టాన్ని అంత పకడ్బందీగా రూపొందించారు. అయితే చట్టం ఎంత పకడ్బందీగా ఉన్నా  నిబంధనలను గాలికొదిలేసి ఎడాపెడా బోర్లు వేస్తున్నారు.

2013 లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్

బోరు బావుల్లో చిన్నారులు పడి మరణించిన సంఘటనలు ఎక్కువ అవడంతో వాటిని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు 2013 లో కొన్ని  గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ విషయంలో కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారాలు కల్పించారు. బోరు బావి తవ్వే యజమానితో పాటు ప్రభుత్వాన్ని కూడా బాధ్యులను చేసింది. అయినా అందరూ కలిసి వాల్టా చట్టాన్ని  నిర్లక్ష్యం చేస్తున్నారు. చట్టాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. పొలాల్లో ఎడాపెడా బోరు బావులు తవ్వేస్తున్నారు. చిన్నారుల ఉసురు తీస్తున్నారు. బోరు బావుల్లో పిల్లలు పడి చనిపోతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా ఇప్పటివరకు  ఏ గ్రామంలో ఎన్ని బావులను అనుమతులు లేకుండా తవ్వారో తేల్చి చెప్పడానికి  రెవెన్యూ డిపార్ట్ మెంట్ దగ్గర ఎలాంటి లెక్కా పత్రం లేదు.

బావులను పూడ్చకుండా వదిలేస్తున్నారు

పొలాల దగ్గర, ఇళ్ల దగ్గర నీళ్ల కోసం బోర్లు వేయడం సాధారణం. కొన్ని బోర్లకు నీళ్లు పడవు. ఇలా నీళ్లు పడని బోరు బావును వెంటనే పూడ్చేయాలి. అది కూడా సైంటిఫిక్ పద్ధతుల్లో జరగాలి. అయితే నీళ్లు పడవు అనే సంగతి తెలియగానే చాలా మంది బోర్లను పూడ్చకుండా వదిలేస్తున్నారు. దీంతో బోరు బావులు డేంజరస్ గా మారుతున్నాయి. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే కేసింగ్ తీసేసి వాటిని రాళ్లు, మట్టితో పూర్తిగా పూడ్చి వేయాలి. మొదట నీళ్లు పడకపోయినా తర్వాత వానలు పడితే నీళ్లు వాటంతట అవే పడతాయన్న  ఆశతో చాలా మంది రైతులు కేసింగులు తీసేయడం లేదు. వాటిపై కవరు చుట్టి, రాళ్లు పెట్టి ఉంచుతారు. తర్వాత వాటి విషయం మరచిపోతారు. ఈ టైంలో దొంగలు వచ్చి కేసింగులు ఎత్తుకుపోయి గోతులను అలాగే వదిలేస్తారు. ఇలా వదిలేసిన గోతులే చివరకు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. చాలా చోట్ల భూమి యజమానుల పిల్లలే  ఆడుకుంటూ పూడ్చని బోరు బావుల దగ్గరకు వెళ్లి అందులో పడి మరణిస్తున్నారు.

ఊపిరాడక చనిపోతున్న చిన్నారులు

చిన్నారులు  బోరు బావిలో పడగానే వారిని రక్షించడానికి బావికి  ప్యారలల్ గా ఒక గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యి ద్వారా బోరుబావి లోపల ఉన్న చిన్నారికి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నిస్తారు. అయితే అంత పెద్ద గొయ్యిలో  చిన్నారికి సహజంగా గాలి అందదు. దీంతో ఊపిరి ఆడక చిన్నారి చనిపోవడం మామూలు విషయం అయిపోయింది.

అమలు కాని తెలంగాణ సర్కార్ ఆదేశాలు

నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే పూడ్చివేయాలని కొన్నేళ్ల కిందట తెలంగాణ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు వీటి పై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా ఉపయోగం లేని బోర్లను వెంటనే పూడ్చివేయాలి. బోరుబావుల మరణాలపై  ప్రజల్లో అవగాహన కల్పించాలి.

దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే

బోరుబావుల సమస్య కేవలం తెలుగు రాష్ట్రాలకేపరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే. బోరుబావుల్లో పడి మృతి చెందిన చిన్నారుల సంఖ్య 2017 నాటికి 561 అని లెక్కలు తేల్చి చెప్పాయి.అసలు ఏ గ్రామంలో ఎన్ని బోరు బావులు ఉన్నాయో ముందుగా లెక్కలు తేల్చాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత మరిచిపోవడం జరుగుతోంది. దీంతో బోరుబావి మరణాలు తగ్గడం లేదు. చిన్నారులు చనిపోయినప్పుడు వాల్టా చట్టాన్ని  గుర్తు చేసుకోవడం కామనైంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం, వాల్టా చట్టాన్ని  పకడ్బందీగా అమలు చేసినప్పుడే చిన్నారులను కాపాడగలిగిన వాళ్లమవుతాం.

‘కర్తవ్యం’లో చూపించారు

బోరుబావుల మరణాలు దేశాన్ని కలచివేశాయి. ఈ నేపథ్యంలో తమిళంలో  ఏకంగా ‘ఆరమ్’ పేరుతో ఓ సిన్మా తీశారు. ఈ తమిళ సిన్మాను ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో కిందటేడాది విడుదల చేశారు. నయనతార ఇందులో కలెక్టర్​ రోల్ లో నటించారు. ఆడుకుంటున్న ఓ పాప, బోరు బావిలో పడిపోవడాన్ని కథాంశంగా తీసుకుని ఈ సిన్మాను తీశారు