- కామారెడ్డి జిల్లాలో 60,472 మంది పేర్లతో లిస్టు
కామారెడ్డి, వెలుగు: కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇప్పటికే సర్వే కొనసాగుతుండగా పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల ను చేర్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు వివిధ సందర్భాల్లో ప్రజలు ఇప్పటికే అప్లయ్ చేసుకున్నారు. చాలా ఏండ్ల నుంచి ఈ అఫ్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ సభ్యులను చేర్చేందుకు సంబంధించిన లిస్టులను శనివారం ప్రభుత్వం నుంచి జిల్లాలకు లిస్టు చేరింది. సివిల్ సప్లయ్ కమిషనర్ ఆఫీసు నుంచి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు లిస్టులు వచ్చాయి.
కామారెడ్డి జిల్లాలో 60,472 మందితో కూడిన లిస్టు చేరింది. ఈ ప్రక్రియ పరిశీలనకు సంబంధించి గైడ్లైన్స్ రావాల్సి ఉంది. 60,472 మందిలో కొన్ని క్షేత్ర స్థాయిలో ఇది వరకే పరిశీలన జరిగి ఉన్నాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లో 27,617, తహసీల్దార్ లాగిన్ లో 3,261, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి లాగిన్లో 29,594 ఉన్నాయి. జిల్లాలో పాత రేషన్ కార్డులు 2 లక్షల 53 వేలు ఉన్నాయి. ఏండ్ల తరబడి వీటిలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చలేదు. కొత్త రేషన్ కార్డుల కోసం 21,841 అప్లికేషన్ల లిస్టు వచ్చింది. క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 20 లోగా సర్వే కంప్లీట్ చేస్తారు. 21 నుంచి 24 వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారి పేర్లను చదివి వినిపిస్తారు.