కామారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కులగణన ఈనెల 6వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అవగాహన సదస్సు శనివారం కామారెడ్డి లోని కళాభారతిలో నిర్వహించారు.
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు బీసీ కులగణన పై ఇదే విషయాన్ని తాను లేవనెత్తిన అంశాలను రికార్డు నుంచి తొలగించారన్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల ప్రచారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ద్వారా కామారెడ్డి లోనే బీసీ డిక్లరేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధిష్టానం ఆదేశాలతో ప్రభుత్వం కులగణన చేపడుతోందన్నారు.
మూడు రోజులపాటు ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇస్తున్నారన్నారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈసర్వే ఆధారంగానే ఉంటాయన్నారు. ఇంటింటి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహాలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించాలన్నారు. దాదాపు లక్ష మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కాసుల బాలరాజ్, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.