నిజామాబాద్, వెలుగు : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రభుత్వసలహాదారుడు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి సర్కారు కులగణన చేపట్టిందని, పూర్తి నివేదిక అందాక బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామన్నారు. ఆదివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికలు పెరిగిన రిజర్వేషన్‌తోనే జరుగుతాయని, ఇందులో అనుమానం లేదన్నారు.
హైకమాండ్ బీసీ బిడ్డ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. హాస్టల్ స్కాలర్షిప్లను 40 శాతానికి పెంచి అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. సావిత్రిబాయిని ఎవరూ పట్టించుకోలేదని, ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆమె స్మృతివనం ఏర్పాటు చేసి, పాఠ్యాంశంగా సావిత్రిబాయి జీవిత చరిత్రను చేర్చేలా చొరవ తీసుకుంటానన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ మహిళా వర్సిటీకి చాలకి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయమన్నారు.
బీసీల శకం ప్రారంభం..
రాజకీయ పార్టీలు పక్కనబెట్టి బీసీలంతా ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని, తమ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ విధానం రద్దు చేయాలని కోరారు. ఎన్నో ఏండ్ల నుంచి చేస్తున్న తమ పోరాటాన్ని గౌరవించిన ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా టీచర్స్‌డేగా ప్రకటించిందన్నారు.
రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీకి సావిత్రిబాయి ఫూలే పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సబ్ కోటా నిర్ణయించకుండా కేంద్ర సర్కారు తెచ్చిన మహిళా బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ కేశవేణు, డీఈవో ఆశోక్, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, కుల్కచర్ల శ్రీనివాస్, ఆర్.గోపాలకృష్ణ, కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, ఎ.మోహన్, కైరంకొండ బాబు ఉన్నారు.