వనపర్తి, వెలుగు: ఆయిల్పామ్సాగును పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం అనేక ఆటంకాలతో నీరుగారిపోతుంది. ప్రభుత్వం రాయితీపై బిందు సేద్య పరికరాలు, మొక్కలు అందిస్తోంది. అయితే సాగు విస్తీర్ణం పెంపు బాధ్యతలను మాత్రం ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. దీంతో ఆయా కంపెనీలు, ఉద్యానశాఖల మధ్య సమన్వయ లోపంతో సీజన్ వారీగా జిల్లాలకు ఇచ్చిన లక్ష్యం నెరవేరడం లేదు. గతేడాది ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం నూరుశాతం పూర్తికాగా, ఈ సంవత్సరం మాత్రం యాభై శాతమే పూర్తయ్యింది. జిల్లాలో నిరుడు మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం పెట్టుకుని సాధించారు. ఈ సంవత్సరం అయిదు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను సాగుచేయాలని భావించగా 50 శాతమే పూర్తయింది.
అశ్వరావుపేటకే మార్కెటింగ్
ఆయిల్‌పామ్ సాగు పెంపుతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసి దాని మార్కెటింగ్ సమస్య లేకుండా చూడడం కంపెనీల బాధ్యత. అధికారులు రైతులను ఒప్పించి ఆయిల్‌పామ్ తోటలను సాగు చేయిస్తున్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ లేదు. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఇక్కడ పండించిన ఆయిల్‌పామ్ గెలలను అక్కడికి తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేయాలి. కానీ ఇక్కడి నుంచి ఆయిల్పామ్గెలలు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆయిల్‌పామ్ యూనిట్ కు తరలిస్తున్నారు.
నిర్వహణ నిధులకు ఎదురుచూపులే
ఆయిల్పామ్సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ఏటా నిర్వహణ నిధుల కింద ఎకరానికి రూ.4,200లు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అంతర పంటలు సాగుచేసేందుకు రూ.2100, తోట నిర్వహణకు మరో రూ.2100 చొప్పున మంజూరు చేస్తారు. నిరుడు సాగు చేసిన రైతులకు మొదటి సంవత్సరం నిధులు సక్రమంగానే ఇచ్చారు. రెండో విడత వానాకాలం సీజన్ ప్రారంభంలో నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఇంత వరకు చేయలేదు. దీంతో నిర్వహణ నిధుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.
నిధులు ఇంకా రాలేదు
నిర్వహణ నిధులు ఇంకా రాలేదు. మార్చి నెలలోనే నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఇంత వరకు రాలేదు. నిధులు రాగానే రైతులకు అందజేస్తాం.
సురేశ్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, వనపర్తి