- మరిన్ని అధికారాలతో పాటు సిబ్బంది కేటాయింపు
- ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, నాలాల బాధ్యత హైడ్రాకే..
- గండిపేట, హిమాయత్‌సాగర్ రక్షణ కూడా..
- నోటీసుల నుంచి కూల్చివేతల దాకా హైడ్రా ఆధ్వర్యంలోనే
- విధివిధానాల ఖరారుకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకే అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నది.
నోటీసులు, కూల్చివేతలు ఏమున్నా అన్నీ హైడ్రా ఆధ్వర్యంలోనే చేపట్టేలా విధివిధానాలను తయారు చేస్తున్నది. కోర్టుల్లో చిక్కులు రాకుండా.. భవిష్యత్‌లో ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయింది. సెక్రటేరియెట్‌లో సీఎస్ శాంతి కుమారి హైడ్రాపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణపై హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ల్యాండ్, చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రాకు మరిన్ని అధికారాలు, సిబ్బందిని నియమించడంపై చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో సీఎస్ చర్చించారు.
సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతున్నదని సీఎస్ అభిప్రాయపడ్డారు. దీన్ని నివారించేందుకు ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే జారీ చేసేలా విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీని ఆమె ఆదేశించారు.
జీహెచ్ఎంసీ, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారీ చేసే అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ పూర్తిగా ఒకే విభాగం హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు వివరించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయడానికి కావాల్సిన పోలీస్ సిబ్బంది, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులను త్వరితగతిన కేటాయిస్తామని సీఎస్ తెలిపారు. ఈ రివ్యూ మీటింగ్‌లో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పౌత్రు, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.