
- ప్రతి నెలా ఆర్టీసీపై రూ. 3.6 కోట్ల భారం
- ఉచిత బస్సు స్కీంతో మహిళలకు రూ.5 వేల కోట్లు ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో ప్రతి నెలా ఆర్టీసీపై రూ. 3.6 కోట్ల అదనపు భారం పడనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. దీంతో వారికి దాదాపు రూ. 5 వేల కోట్లు ఆదా అయినట్టు తెలిపారు.
ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజూ అదనంగా 14 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, అందుకే డీఏ పెంచామని చెప్పారు. మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు.