పతకాలు బెయిల్‌‌‌‌కు ప్రామాణికం కాదు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు

పతకాలు బెయిల్‌‌‌‌కు ప్రామాణికం కాదు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్‌‌‌‌ పోలీసు ఉన్నతాధికారి టి.ప్రభాకర్‌‌‌‌ రావుకు బెయిల్‌‌‌‌ ఇవ్వొద్దని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డ్యూటీలో ఉండగా పతకాలు సాధించారని చెప్పి.. ఇప్పుడు తీవ్ర నేరారోపణల కేసులో ముందస్తు బెయిల్‌‌‌‌ పొందడానికి అర్హులు కాదని చెప్పింది. గతంలో పొందిన పతకాలు ప్రామాణికం కాదని తేల్చిచెప్పింది. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో ప్రభాకర్‌‌‌‌ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారించారు. 

పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌‌‌ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా, పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ పల్లె నాగేశ్వరావు హైకోర్టులో వాదించారు. ప్రభాకర్‌‌‌‌రావు క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నారని చెబుతున్నారని, ఆయనకు నిజంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండి ఉంటే రిటైర్ అయ్యాక ఓఎస్‌‌‌‌డీగా ఎలా విధులు కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసు నమోదు అవ్వగానే ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు అమెరికా పారిపోయారని, పాస్‌‌‌‌పోర్టు రద్దు, రెడ్‌‌‌‌కార్నర్‌‌‌‌ నోటీసు జారీ అయ్యాక ఇప్పుడు ఇండియా వచ్చేస్తామని, కేసుకు సహకరిస్తామని చెబుతున్నారన్నారు. 

అరెస్ట్ కాకుండా ఉత్తర్వులివ్వండి: లాయర్ నిరంజన్‌ రెడ్డి

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది నిరంజన్‌‌‌‌ రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ వయసు, అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అరెస్టు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తయ్యిందని, పోలీసులు చార్జిషీట్‌‌‌‌ కూడా దాఖలు చేశారని గుర్తుచేశారు. అమెరికాలో ఉన్నప్పటికీ అధికారుల దర్యాప్తునకు ఆయన సహకరిస్తూనే ఉన్నారని చెప్పారు.

 పిటిషనర్‌‌‌‌ ఇండియాకు వచ్చి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌ ధ్వంసంలో పిటిషనర్‌‌‌‌ పాత్ర లేదని తెలిపారు. గత 30 ఏండ్ల సర్వీసులో ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు పలు పతకాలు సాధించారని, మచ్చలేని విధి నిర్వహణను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్‌‌‌‌ ఇవ్వాలని కోరారు. అనంతరం విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.