- అకారణంగా పదేండ్లు జైలులో మగ్గేలా చేసిన దోషులను తేల్చాలి
- సీజేఐకి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ
హైదరాబాద్, వెలుగు: పౌరహక్కుల ఉద్యమకారుడు, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతిచెందలేని, ఆయనను సర్కారే హత్య చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని తేల్చిన కోర్టు.. ఆయనను అకారణంగా పదేండ్లు జైలులో మగ్గేలా చేసిన దోషులు ఎవరో కూడా తేల్చాలని కోరారు. ఈ మేరకు సాయిబాబాకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీపీఐ తరఫున నారాయణ లేఖ రాశారు. సోమవారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలోని మగ్దూం భవన్ లో సీజేఐకి రాసిన లేఖను మీడియాకు రిలీజ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలు చేయనున్నట్టు చెప్పారు. దాదాపు 90 శాతం అంగవైకల్యంతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను పదేండ్లపాటు అక్రమంగా నిర్బంధించిన కేంద్రం కూడా ముద్దాయేనని ఆయన పేర్కొన్నారు. అర్బన్ నక్సలైట్లను ఏరివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం గర్హనీయమని, కమ్యూనిజాన్ని ఎవరూ అంతం చేయలేరని, అది నాటి హిట్లర్ వల్లే కాలేదని నారాయణ పేర్కొన్నారు. అమిత్ షానే పలు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, ఆయన నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఏకంగా 12 మందిని హత్య చేయించారని ఆరోపించారు. కేంద్రం పెద్దలు పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ.. దేశాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిన వారిపై ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగించి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.