ఆత్మగౌరవం, సామాజిక న్యాయం పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో సామాజిక న్యాయం నిజంగా అమలు అవుతున్నదా? అంటే లేదనే చెప్పాలి. ప్రాథమిక, ఉన్నత విద్య, ప్రజారోగ్యం, ప్రజా రవాణా తదితర అంశాల్లో స్వరాష్ట్రంలోనూ అసమానతలు కొనసాగుతున్నాయి. జనాభాలో సగం అయిన మహిళల అవకాశాల గురించి చూస్తే.. తెలంగాణ వచ్చి న తర్వా త ఎంత మంది మహిళా ప్రజాప్రతినిధులు మంత్రులు అయ్యా రు? ఇతర నామినేటెడ్ పోస్టులు, పదవుల్లో వారికి దక్కిన అవకాశాలు ఎన్ని? అనేది చూస్తే సామాజిక న్యాయం ఎలా అమలవుతున్నదో తెలుస్తుంది.
ఈ సామాజిక న్యాయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా ర్థులకు గొప్పగా స్కాలర్షిప్ లు ఇస్తున్నదని గల్లీ కార్యకర్త నుంచి ఢిల్లీ లీడర్దాకా వేదికలపై చెబుతున్నారు. కానీ సర్కారు ఇచ్చే స్కాలర్‌షిప్‌లతో చదువులు పూర్తి కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే అంబేద్కర్ విదేశీ విద్య నిధి పథకమే దానికి ఉదాహరణ. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 10 లక్షలు ఇతర సాయం చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం విదేశీ విద్య నిధి పథకం తీసుకొచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ స్కాలర్షిప్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.
సాయం మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచింది. కానీ పెంచిన మొత్తంతో కూడా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోతున్నారు. సర్కారు ఇస్తున్న రూ. 20 లక్షలతో యూనివర్సిటీల ట్యూషన్ ఫీజు కూడా కట్టలేకపోతున్నారు. సర్కారు సాయం చేస్తున్నది కదా.. అని అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు డబ్బులు సరిపోక అక్కడ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వాటిని తీర్చేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
ఖర్చు పెరిగింది.. మరి సాయం?
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మాస్టర్స్ చేయాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. రూ 20 లక్షల స్కాలర్షిప్ ఏ మూలకూ సరిపోవడం లేదు. విదేశీ విద్య నిధి పథకాన్ని చూసి పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు డబ్బులు సరిపోక అక్కడ పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా మాస్టర్స్కోర్సు కంటే పార్ట్ టైమ్ జాబ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇయ్యాల వందలాది మంది స్టూడెంట్స్ విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని స్కాలర్‌షిప్‌తో అణగారిన వర్గాల విద్యా ర్థులు విదేశాల్లో ఉన్నత విద్యను ఎలా పొందగలరు?
స్కీమ్‌లో మార్పులు చేయాలి
ప్రపంచంలోని ఎంపిక చేసిన10 దేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తేనే ప్రభుత్వం స్కాలర్షిప్ఇస్తున్నది. ఇవిగాక ఇంకెక్కడైనా ప్రముఖ యూనివర్సిటీలో సీటు దొరికినా, ఆ దేశానికి వెళ్లి చదువుకోవాలనుకున్నా.. సర్కారు ఎలాంటి సాయం చేయడం లేదు. ప్రస్తుత గ్లోబల్ యుగంలో చాలా దేశాల్లో ఉన్నత విద్యావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. అలాంటప్పుడు ఎంపిక చేసిన పది దేశాలకే వెళ్లి చదువుకోవాలనడం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఆ పది దేశాలకు పరిమితం చేయడం సరికాదు. దేశాలతో సంబంధం లేకుండా విదేశీ విద్య నిధి పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ, పీజీ కోర్సుల్లో 60 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది.
మన దేశంలో ఏ ప్రభుత్వ యూనివర్సిటీల్లోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే కేవలం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు విదేశీ విద్య నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 60 శాతం మార్కులు పెట్టడం సరికాదు. ఈ నిబంధన వల్ల మెజార్టీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఆయా యూనివర్సిటీలు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకున్నా.. విదేశీ విద్య నిధి పథకం పొందాలంటే జీఆర్ఈ తదితర పరీక్షలు రాయాలని ప్రభుత్వం నిబంధన పెట్టడం కూడా సరికాదు. ఇలా ఈ పథకంలో విద్యార్థులు విదేశీ విద్యనందుకోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించి వాటిని మార్చాల్సిన
అవసరం ఉన్నది.
అంబేద్కర్ ఆశయాలు ముఖ్యం
విద్య ఒక్కటే పేదరికాన్ని దూరం చేయగలదని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదని నమ్మిన వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్. ఎస్సీ, ఎస్టీ తదితర అణగారిన వర్గాలకు విద్య అందాలనేది ఆయన ఆశయం. ఆయన ఆశయాన్ని అమలు చేయాల్సిన నాయకులు, ప్రభుత్వాధినేతలు దాన్ని పక్కన పెట్టి, ఆయన విగ్రహాలు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసమానతలను రూపుమాపాలని అంబేద్కర్ ఆకాంక్షిస్తే ఇప్పటి నేతలు వాటిని ఇంకా పెంచుతున్నారు.
ఇటీవల బాసర ట్రిపుల్ఐటీకి వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ‘ప్రపంచంలో అందరూ గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు. మనం మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం” అని అన్నారు. మంత్రి చెప్పిన మాటల్లో కొంత నిజం ఉండొచ్చుగాక, మరి ఆవిష్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు, అవకాశాలు కల్పిస్తున్నదో ముఖ్యమే కదా? విదేశాల్లో విద్యారంగానికి మెరుగైన నిధులు ఇచ్చి, సౌకర్యాలు కల్పించి విద్యలో నాణ్యతా ప్రమాణాల కోసం కృషి చేస్తారు. ఆవిష్కరణలకు అవసరమైన అవకాశాలు ఏర్పాటు చేస్తారు. మరి మన దగ్గర కనీస సౌలత్‌ల కోసం కూడా వానలో నిరసనలు, ఎండలో ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి. - ధనావత్ అశోక్, ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్, దిహేగ్, నెదర్లాండ్స్