
- సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 300 మంది దాటలే
- అప్లికేషన్లు వేలల్లో.. సాయం కొందరికే
- తప్పని ఎదురుచూపులు
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : కుల వృత్తులపై ఆధార పడిన బీసీలకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల సాయం మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 34 మందికే అందింది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 300 మందికి మించి అందలేదు. జూన్ నెలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో కొందరికి సాయం అందించారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్పింది.
ప్రతినెలా నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. కానీ జిల్లాలకు అవసరమైన నిధులు రాకపోవడంతో అన్ని నియోజకవర్గాల్లో ఆశించినంత మంది లబ్ధిదారులకు సాయం అందడం లేదు. దరఖాస్తుదారులు వేల సంఖ్యలో ఉంటే సాయం మాత్రం కొందరికే అందడంతో ఎదురుచూపులు తప్పడంలేదు.
ఇదీ పరిస్థితి..
- మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం మొత్తం 13,196 మంది బీసీలు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఎంక్వైరీ చేసి వారిలో 10,801 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి దశలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలలో కలిపి కేవలం 34 మందికి మాత్రమే లక్ష రూపాయల సాయం అందించారు.
- సంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 20,894 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున లబ్ధిదారులను గుర్తించారు. ప్రస్తుతానికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో 299 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో లక్ష రూపాయల సాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. సంగారెడ్డి, అందోల్, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఇంకా చెక్కుల పంపిణీయే మొదలు పెట్టలేదు.
- సిద్దిపేట జిల్లాలో మొత్తం 21,460 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రమే 300 మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఇంకా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సాయం అందక ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడిస్తరో తెలుస్తలే..
ప్రభుత్వం ప్రకటించిన బీసీలకు లక్ష రూపాయల సాయం ఎవరికి ఎప్పుడు అందుతుందో స్పష్టత లేదు. నెళ్లలైనా ఆ దిశగా చర్యలు ఏవీ కనిపిస్తలేవు. సాయం అందితే కులవృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనుకున్న. కానీ ఎప్పుడిస్తరో అర్థమైతలేదు.
- వడ్ల శంకర్, శివ్వంపేట, మెదక్ జిల్లా