- సిటీలో ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోని ఓనర్లు
- రూఫ్ టాప్ హోర్డింగ్స్ ఫ్రేమ్స్ తీసేయాలని బల్దియా ఆదేశాలు
- అయినా లెక్క చేయకుండా కొనసాగిస్తున్న కొందరు
- తాజాగా మియాపూర్ లో కరెంట్ వైర్లపై చినిగి పడిన హోర్డింగ్ ల బ్యానర్లు
- ఆ ప్రాంతమంతా గంటల తరబడి విద్యుత్ అంతరాయం
హైదరాబాద్, వెలుగు : సిటీలో హోర్డింగ్ లు, రూఫ్ టాప్ ఫ్రేమ్స్, యూనిపోల్స్ తో జరిగే ప్రమాదాల దృష్ట్యా కొన్నేండ్ల కిందట ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయినా.. అక్రమంగా కొందరు రూఫ్ టాప్ హోర్డింగ్స్ ఫ్రేమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఖాళీగా ఉన్నవాటిని తొలగించాలని జీహెచ్ఎంసీ ఆదేశించినా పట్టించుకోవడంలేదు. స్వయంగా కొన్నింటిని అధికారులే తొలగించారు. ఇంకొన్నింటిని ఏజెన్సీలు తొలగించాయి.
రూఫ్ టాప్ ఫ్రేమ్స్ ను పూర్తిగా తీసివేయాలని పలుమార్లు ఆదేశించినా సంబంధిత ఇంటి, బిల్డింగ్ ఓనర్లు లెక్కచేయడంలేదు. దీంతో తాజాగా మంగళవారం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి మియాపూర్ రోడ్డులోని ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ బ్యానర్ గాలికి లేచి కరెంట్ తీగలపై పడింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
నాలుగేండ్ల కిందే బ్యాన్ చేసినా..
సిటీలో హోర్డింగ్ లను రద్దు చేస్తూ 2020 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి రద్దతో తాము నష్టపోతామని ఏజెన్సీలు హై కోర్టుకు వెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించబోమని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కోర్టులో విచారణ కొనసాగుతుండగా... హోర్డింగ్స్, ఫ్రేమ్స్ ను తొలగించలేదు. ఆ హై కోర్టు తీర్పు తర్వాత జీహెచ్ఎంసీ ఆదేశించింగా... సిటీలో మొత్తం 2,700 హోర్డింగ్స్ ఫ్రేమ్స్ ఉండేవి.
ఇందులో కొన్నింటిని ఏజెన్సీలు, ఇంకొన్నింటిని జీహెచ్ఎంసీ తొలగించింది. బయట రోడ్లపై ఉండే యూనిపోల్స్ ను కూడా తీసివేసింది. ఇంకా ఇండ్లపై, బిల్డింగ్ లపై హోర్డింగ్స్ ఫ్రేమ్స్ ఉండగా.. వాటిని కూడా తొలగించాలని ఆదేశించినా చాలామంది పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా అక్రమంగా బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తుండటంతో ఇబ్బందులు ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ఇలా ఎన్నో ప్రమాదాలకు కారణంగానూ మారాయి. గతంలో కూడా హోర్డింగ్స్ పడి వెహికల్స్ ధ్వంసం కావడంతో పాటు పలువురు ప్రమాదాలకు గురయ్యారు.
ప్రమాదాలకు కారణంగా..
రూఫ్ టాప్ పై హోర్డింగ్ ఫ్రేమ్స్ ఎప్పుడో ఏండ్ల కిందట ఏర్పాటు చేశారు. వాటిపై ఓనర్లు ఎంతో ఆదాయం పొందారు. నాలుగేండ్ల కిందట నుంచి పర్మిషన్లు బంద్ కావడంతో అవి ఖాళీగా ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ కూడా తొలగించాలని జీహెచ్ఎంసీ ఆదేశించినా కొందరు తొలగించలేదు. అలాగే ఉంచడంతో అవి ప్రమాదకరంగా మారాయి. కొన్ని సందర్భాల్లో ఈదురు గాలులు ఎక్కువగా వస్తే అవి కింద పడే ప్రమాదం పొంచి ఉంది.
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లే..
హోర్డింగ్స్, రూఫ్ టాప్ ఫ్రేమ్స్ తొలగించాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు పలుమార్లు చెబుతూ వస్తున్నారు. కొందరు పట్టించుకోవడంలేదు. వానాకాలం రాకుముందే అన్ని ఫ్రేమ్స్ తొగించాలని అధికారులు ప్లాన్ చేశారు. కొన్నింటిని స్వయంగా కూడా తీసివేశారు. ఆ లోపు అసెంబ్లీ ఎన్నికలు రావడం, అనంతరం లోక్ సభ ఎన్నికల వచ్చాయి. పూర్తయిన తర్వాత మరోసారి ఫ్రేమ్స్ దృష్టి సారిస్తామని అధికారులు చెప్పారు. రూప్ టాప్ పై ఫ్రేమ్స్ ఉన్నా వాటిని ఓనర్లు తొలగించకపోతే బల్దియానే తొలగించనుంది.
హోర్డింగ్ ఫ్రేమ్స్ వెంటనే తొలగించాలె
సిటీలో హోర్డింగ్ ల ఏర్పాటుకు పర్మిషన్ లేదు. గతంలో ఏర్పాటు చేసిన వాటిని కూడా తొలగించాలి. మేం స్వయంగా కొన్నింటిని తొలగించాం. ఇండ్లపై రూప్ టాప్ లో ఏర్పాటు చేసిన ఫ్రేమ్స్ ను కూడా తొలగించాలని సంబంధిత ఓనర్లకు చెప్పాం. ఎక్కడైనా ఇంకా తొలగించని వారు ఉంటే వాటిపై ఫోకస్ చేస్తం. ప్రమాదాలకు కారణమయ్యే ఫ్రేమ్స్ ను వెంటనే తీసివేయాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంది. లేదంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటం.
ప్రకాశ్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్