- ఓన్ వెహికిల్స్‌కు సర్కారు బిల్లులు
- డీఆర్డీవో ఆఫీస్ డీపీఎంల ఇష్టారాజ్యం
- ఫీల్డ్ విజిట్లకు స్టాఫ్ వాహనాలు
జనగామ, వెలుగు: సర్కారు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేసే డీపీఎం(డిస్ట్రిక్ట్ప్రాజెక్ట్ మేనేజర్)లకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. అద్దె ప్రాతిపదికన వీటిని వినియోగించాల్సి ఉంటుంది. సొంత లేదా దగ్గరి బంధువుల పేరిట ఉన్న వాహనాలను వినియోగిస్తున్నట్లు చూపించి, యథేచ్ఛగా బిల్లులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనగామ డీఆర్డీవో ఆఫీస్ లోని డీపీఎం ల తీరు చూస్తే అసలు డీపీఎంల కార్లు ఉన్నాయా.? లేవా అనే సందేహాలను ఆఫీస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
టూ వీలర్లే దిక్కు..
డీఆర్డీవో ఆఫీస్ లో ఐదుగురు డీపీఎంలు విధులు నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్, బ్యాంకు లింకేజీ, సంఘాల సంస్థాగత నిర్మాణం, మార్కెటింగ్, జీవనోపాధులు, వ్యవసాయ అనుబంధ అంశాల పర్యవేక్షణ, సదరం వంటి విభాగాల్లో డీపీఎంలు పనిచేస్తున్నారు. వీరందరూ జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతంతోపాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తుంటారు.
ఈ శాఖ పరిధిలో కీలక బాధ్యతలు చేపట్టే వీరికి ఫీల్డ్విజిట్లలో ఇబ్బందులు ఉండొద్దని సర్కారు వాహన సౌకర్యం కల్పించింది. ఒక్కో కారుకు ప్రతి నెలా రూ.33 వేలు అద్దె చెల్లిస్తున్నది. కానీ, దానిని పక్కదారి పట్టించి సొమ్ముచేసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. డీపీఎంలంతా హన్మకొండ నుంచి బస్సుల్లో అప్‌అండ్‌డౌన్ చేస్తున్నారు. ఇక ఫీల్డ్ విజిట్ల కోసం గ్రామాలకు వెళ్లాల్సి వస్తే కిందిస్థాయి సిబ్బంది సీసీలు, ఏపీఎంల టూ వీల్లర్లపై పర్యటనలు చేస్తున్నట్లు స్టాఫ్ చెబుతున్నారు. పైస్థాయి అధికారులు కావడంతో సిబ్బంది ప్రశ్నించలేకపోతున్నట్లు తెలుస్తోంది.
టూర్లు అంతంతే..
జనగామ జిల్లాలో 12 మండలాలుండగా, ప్రతి డీపీఎం దాదాపుగా అన్ని మండలాల్లో పర్యటించడం, రూరల్ డెవలప్ మెంట్ అంశాలపై సమీక్షలు, అవగాహనలు కల్పించాల్సి ఉండగా, నామ మాత్రపు పర్యటనలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆరోగ్య సమస్యలు, బ్యాంక్ రుణాలు, సంఘాల బలోపేతం, పింఛన్లు, సదరం పనులు, జీవనోపాధి పథకాలు, మార్కెటింగ్, వడ్ల కొనుగోలు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత డీపీఎంల పై ఉంది.
ఇందుకోసం వాహన సౌకర్యం కల్పిస్తే కార్లు వాడకుండానే బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఈ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారి కనుసన్నల్లో కార్ల బిల్లులు దర్జాగా డ్రా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు అధికారి బదిలీ కాగా, ప్రస్తుతం వచ్చిన అధికారి కూడా అదేబాటలో సాగుతున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని కోరుతున్నారు.