రాజగోపాల్ రాజీనామాతోనే ప్రభుత్వం దిగివచ్చింది : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ప్రభుత్వం దిగివచ్చి ఎల్బీ నగర్ సహా ఐదు నియోజకవర్గాల్లో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ జీవో ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎల్బీ నగర్ సహా పలు ప్రాంతాల్లో లోన్ లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. 

వాళ్ల ఇళ్ల స్థలాలు రెగ్యులరైజేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. బీజేపీ వారి కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తోందని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో సర్కారు లో కదలిక వచ్చిందన్నారు. ఏళ్లకేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఉప ఎన్నికల కోసమే దిగివచ్చి జీవో ఇచ్చిందని, ఇది బీజేపీ, రాజగోపాల్ రెడ్డి సాధించిన విజయం అన్నారు.