స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ మారతారన్న ప్రచారంతో పాటు..సెప్టెంబర్ 4వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రాజయ్యతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చిన దాస్యం వినయ్ భాస్కర్..ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.
- ALSO READ:మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సర్పంచి నవ్య
రాజయ్యతో పలు విషయాలపై వినయ్ భాస్కర్ చర్చించారు. పార్టీ విషయాలు మాట్లాడేందుకే రాజయ్య దగ్గరకు వచ్చానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. రాజయ్య టికెట్ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉద్యమకాలం నుంచి పనిచేసిన నాయకుడు రాజయ్య అని పేర్కొన్నారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వినయ్ భాస్కర్ చెప్పినా... పార్టీ అధిష్టానం సూచన మేరకే వినయ్ భాస్కర్ రాజయ్య దగ్గరకు వచ్చినట్టు సమాచారం.
మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసమే తాను దామోదర రాజనర్సింహను కలిశానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దాంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని వివరించారు. తాను పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా అందరూ సహకరించాలని కోరారు.
అయితే దాస్యం వినయ్ భాస్కర్ చర్చల తర్వాత రాజయ్య మెత్తబడినట్లు తెలుస్తోంది. వినయ్ భాస్కర్ బుజ్జగింపులకు తలొగ్గిన రాజయ్య..పార్టీ మారే విషయాన్ని రాజయ్య వాయిదా వేసుకున్న సమాచారం.