- అంబేద్కర్నాలెడ్జ్ సెంటర్ల పేరిట సర్కారే నిర్వహిస్తుంది
- 119 నియోజకవర్గాల్లోఏర్పాటు చేస్తాం
- భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం, వెలుగు : పోటీ పరీక్షలకు సిద్ధం కావడానిక నిరుద్యోగుల కోసం ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన భీమవరంలో మాట్లాడారు. పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువతీ యువకులు హైదరాబాద్ వచ్చి లక్షలు వెచ్చించి కోచింగ్తీసుకోలేరని, వారి కోసం రాష్ట్రంలోని119 నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలకు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ సెంటర్ల భవన నిర్మాణాల కోసం నిధులు కూడా మంజూరు చేశామని, కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేయనున్నామని ప్రకటించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో అద్భుతమైన స్టూడియో నిర్మించి నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఆన్ లైన్ కోచింగ్ ఇస్తామని చెప్పారు. కోచింగ్ కు సంబంధించి టైం టేబుల్ ముందుగానే ప్రకటించి దాని ప్రకారం క్లాసులు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మాట ఇచ్చినట్టుగానే మూడు నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మార్చి ఒకటో తేదీన 6,50,262 మందికి వేతనాలిచ్చామన్నారు. 2019 ఆగస్టు నుంచి మొదలుపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఏ ఉద్యోగికి ఒకటో తేదీన జీతాలు అందుకోలేదన్నారు. ఈఎంఐ చెల్లింపులు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి కష్టమవుతున్నా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు
ఆరు గ్యారెంటీల హామీల అమలులో బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు. మధిర నియోజకవర్గంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ గురుకుల పాఠశాలలు ఒకే చోట నిర్మిస్తామన్నారు. కామన్ ప్లే గ్రౌండ్, ల్యాబ్స్ తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు మినీ ఎడ్యుకేషన్ హబ్స్‌గా డెవలప్ చేయబోతున్నామని వివరించారు.