అది 1997. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏండ్లయింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల్ని ఘనంగా నిర్వహించాలనుకున్నాను. రాష్ట్ర పాలనకు గుండె కాయలాంటి సెక్రటేరియట్‌లో అతి పెద్ద జెండాను ఆవిష్కరించాలనుకున్నాను. నా స్నేహితుడు అరుణ్‌తో కలసి ప్లాన్ రెడీ చేశాను. ఆ ఆలోచనను నాన్న దేవేందర్‌గౌడ్ (అప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రి)కు వివరించాను. ఆయన సాయంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకు చెప్పాను. ఆయనకు అది నచ్చడంతో ‘గో ఎహెడ్’ అన్నారు. అన్ని అనుమతులతో సెక్రటేరియట్‌లోని జె బ్లాక్‌పై అందరికీ జెండా కనిపించేటట్టు ఏర్పాట్లు చేశాం. ఆగస్టు 14 కల్లా అతి పెద్ద జెండాను తయారుచేయించి జె బ్లాక్ అంతా కవర్ అయ్యేట్టు ప్లాన్ చేశాం. అశోక చక్రం వ్యాసం 30 మీటర్లున్నఆ జెండా తయారుచేయడానికి చాలా మంది సహకరించారు.
జె బ్లాక్ జెండామయం
ఆగస్టు 14న రాత్రి సెక్రటేరియట్ ‘జె’ బ్లాక్ దగ్గరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేబినెట్ మంత్రిగా ఉన్న నాన్న దేవేందర్‌గౌడ్, ఇతర కేబినెట్ మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అక్కడికి వచ్చారు. సీఎం చంద్రబాబు ఫ్లడ్ లైట్లను స్విచ్ ఆన్ చేయడంతో త్రివర్ణపతాకాన్ని కప్పుకొన్న ‘జె’ బ్లాక్ ఆ దీపాల కాంతుల్లో మెరిసిపోయింది. అందరి వందనాలు తీసుకొని పులకరించినట్లు ఆనందంతో జెండా రెపరెపలాడింది. ‘భారత్ మాతాకీ జై’, ‘బోలో స్వతంత్ర భారత్‌కీ జై’ నినాదాలతో సెక్రటేరియట్ మార్మోగింది. ఆ రాత్రి నేను, నా ఫ్రెండ్ అరుణ్, ఇంకొందరు ఫ్రెండ్స్ ట్యాంక్‌బండ్ మీద నుంచి హుస్సేన్‌సాగర్ నీటిలో మువ్వన్నెల జెండాను చూస్తూ పరవశించిపోయాము. మా జీవితంలో మర్చిపోలేని అపురూప సన్నివేశం అది. జీవితాంతం నా గుండెలో పదిలంగా ఉండిపోయే అరుదైన కార్యక్రమం అది.
నాటి రాష్ట్రపతి రమ్మన్నారు
‘మువ్వన్నెల జెండాను కప్పుకొన్నజె బ్లాక్ ’ అంటూ తర్వాతి రోజు ప్రింట్ మీడియాలో వార్త ప్రముఖంగా వచ్చింది. జాతీయ టెలివిజన్ చానళ్లు కూడా వార్తకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం మాకు సంతోషాన్నిచ్చింది. అంతకంటే అద్భుతమేంటంటే ఆ వార్తను చూసి నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మమ్మల్ని రాష్ట్రపతి భవన్‌కు రమ్మని ఆహ్వానించారు. మేము ఏర్పాటు చేసిన జాతీయ జెండా ‘రెప్లికా ’ను ఓ జ్ఞాపికగా తయారు చేయించాము. మేము ఊహించని మరో సర్‌ప్రైజ్.. నాటి లోక్‌సభ స్పీకర్ బాలయోగి మమ్మల్ని రాష్ట్రపతిభవన్‌కు తీసుకెళ్లారు. నారాయణన్ ఎంతో ఆదరంగా మాతో మాట్లాడారు. మమ్మల్ని అభినందించారు. రాష్ట్రపతి ఇచ్చిన సందేశం మాలో మరింత స్ఫూర్తిని కలిగించింది. ఒకవైపు నా వ్యాపారం చేస్తూనే మరోవైపు ‘దేవేంద్ర ఫౌండేషన్’లో భాగస్వామినై సామాజిక కార్యక్రమాలను చేయడానికి శ్రీకారం చుట్టాను. మువ్వన్నెల జెండా చూసినపుడల్లా 50వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మేము చేసిన కార్యక్రమం గుర్తుకొస్తుంది. ఆనందంతో నా కళ్లు చెమర్చుతాయి. కానీ ‘జెండా బ్లాక్ ’గా పిలవబడిన ‘జె’ బ్లాక్‌ను సర్కారు కూల్చేయడంతో ఇప్పుడు కూడా నా కళ్లు చెమర్చుతున్నాయి.
తూళ్ల విజయేందర్ గౌడ్