నేతన్న, రైతన్నల  సంక్షేమానికి ప్రాధాన్యం..చేనేత కార్మికులకు రూ.900 కోట్ల ఆర్డర్లు : మంత్రి తుమ్మల

నేతన్న, రైతన్నల  సంక్షేమానికి ప్రాధాన్యం..చేనేత కార్మికులకు రూ.900 కోట్ల ఆర్డర్లు : మంత్రి తుమ్మల
  • రూ. 34  కోట్లతో చేనేత రుణాలు 
  • మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొన్నంతో కలిసి సిరిసిల్ల అపెరల్​  పార్క్‌‌లో టెక్స్‌‌పోర్ట్‌‌ యూనిట్‌‌ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : నేతన్నలు, రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్లలా చూస్తున్నదని.. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌రావు చెప్పారు. చేనేత కార్మికులు, రైతుల అభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే సిరిసిల్లలో అపెరల్‌‌పార్క్‌‌ను ఏర్పాటు చేసి, ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సిరిసిల్లలోని అపెరల్‌‌ పార్క్‌‌లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 62 కోట్లతో 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పంక్చుయేట్‌‌ వరల్డ్‌‌ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్ పోర్ట్)యూనిట్‌‌ను శుక్రవారం మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌తో కలిసి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రూ.20,600 కోట్లను మాఫీ చేశామని చెప్పారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్నలకు రూ.34 కోట్లతో రూ.లక్ష వరకు రుణమాఫీ చేశామని తెలిపారు.

నేతన్నలకు పెండింగ్‌‌లో ఉన్న రూ.914 కోట్ల బకాయిలు కూడా విడుదల చేశామన్నారు. ఒకే రోజు వివిధ పథకాల కింద రూ. 290 కోట్లు జమ చేశామని, చేనేత భరోసా, చేనేత బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలకు అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారానే కొనుగోలు చేస్తామన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డితో చర్చించి త్వరలోనే వర్కర్‌‌ టు ఓనర్‌‌ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. 

టెక్స్‌‌పోర్ట్‌‌ సంస్థ విస్తరించాలి : పొన్నం

టెక్స్‌‌పోర్ట్‌‌ సంస్థ విస్తరించి మరిన్ని యూనిట్లు ప్రారంభించాలని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల అపెరల్‌‌ పార్క్‌‌లో రూ.62 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్‌‌లో పరిశ్రమ విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టెక్స్‌‌పోర్ట్‌‌ సంస్థ మరింత విస్తరించాలని, స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించిందని, వీటి ఆర్డర్లను కూడా సిరిసిల్ల నేతన్నలకే ఇచ్చిందన్నారు.

సిరిసిల్లలో యారన్‌‌ బ్యాంక్‌‌ను విస్తరించాలని, క్లాత్‌‌ ప్రాసెసింగ్ యూనిట్‌‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌‌ ఇన్‌‌చార్జి కేకే.మహేందర్​రెడ్డి మంత్రులను కోరారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌‌, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సంస్థ సీఈవో చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్‌‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల నేతన్నలకు 12 వేల అంత్యోదయ కార్డులిచ్చాం : శ్రీధర్‌‌బాబు

వైఎస్‌‌ సీఎంగా ఉన్న సమయంలో ఆకలి చావులను ఆపేందుకు సిరిసిల్ల నేతన్నలకు 12 వేల అంత్యోదయ కార్డులు ఇచ్చామని శ్రీధర్‌‌బాబు చెప్పారు. టెక్స్‌‌పోర్ట్‌‌ సంస్థ ప్రతినిధులతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించి ఈ పరిశ్రమను ప్రారంభించినట్లు తెలిపారు. వేములవాడ గుడి అభివృద్ధికి బడ్జెట్‌‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. కరీనంగర్‌‌ శాతావాహన యూనివర్సిటీని గతంలో కాంగ్రెస్సే స్థాపించిందన్నారు.

ప్రస్తుతం యూనివర్సీటీలో ఇంజినీరింగ్‌‌ కాలేజీ, లా కాలేజీలను సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటి పారుదల, రహదారులు, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలుపుతామని చెప్పారు.