టెల్కోలకు రూ.లక్ష కోట్ల బూస్ట్ ?: వొడాఫోన్​ ఐడియాకు ఎంతో మేలు

  • భారీగా ఏజీఆర్ ​బకాయిలను రద్దు చేసే చాన్స్​
  • వొడాఫోన్​ ఐడియాకు ఎంతో మేలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి టెలికం పరిశ్రమకు త్వరలోనే తీపికబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీలు తనకు చెల్లించాల్సిన అడ్జస్టెడ్​ గ్రాస్​ రెవెన్యూ (ఏజీఆర్​) బకాయిల్లో రూ.లక్ష కోట్ల వరకు మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ సర్కారు ఇది వరకే స్పెక్ర్టమ్ ​బకాయిలకు బ్యాంక్​ గ్యారంటీ ఇవ్వడాన్ని రద్దు చేసి ఊరట కల్పించింది. సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పు ఫలితంగా టెల్కోలు ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. 

ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వొడాఫోన్ ఐడియా, ఎయిర్​టెల్​కు ఎంతో మేలు జరుగుతుంది. అప్పులతో ఇబ్బందిపడుతున్న టెలికం పరిశ్రమకూ  బూస్ట్​ ఇచ్చినట్టు అవుతుందని ఈ రంగంలోని ఎక్స్​పర్టులు అంటున్నారు. ‘ఇది సానుకూల విషయం. ఏజీఆర్​ బకాయిల రద్దు గురించి ప్రభుత్వం ఫైనాన్స్​ మినిస్ట్రీతో, టెలికం డిపార్ట్​మెంట్​తో చర్చిస్తున్నది. అమలుకు తుది గడువును విధించలేదు. 

ఏజీఆర్​ విషయంలో టెల్కోలకు ఊరట ఇవ్వాలన్న విషయంలో అంగీకారం కుదిరింది”అని ఈ చర్చలతో సంబంధం ఉన్న సీనియర్​ఆఫీసర్​ఒకరు చెప్పారు. తమకు ఆర్థికంగా విపరీతంగా సమస్యలు ఉన్నాయని, సాయం చేయాలని ఇది వరకే ఎయిర్​టెల్​, వొడాఫోన్​లు ఐడియా డిపార్ట్​మెంట్​ఆఫ్ టెలికం (డాట్) ను కోరాయి. 

సాయం ఎలా ఉండొచ్చంటే..

కేంద్రం దగ్గర ఉన్న ప్రపోజల్​ ప్రకారం.. ఏజీఆర్​ వడ్డీపై 50 శాతం, పెనాల్టీలు, వడ్డీపై పెనాల్టీలను 100 శాతం మాఫీ చేస్తారు. కేబినెట్​ దీనిని యథావిధిగా ఆమోదిస్తే టెల్కోలకు రూ.లక్ష కోట్ల వరకు మేలు జరుగుతుంది. అప్పుల కుప్పగా మారిన వొడాఫోన్​ఐడియాకు ఈ నిర్ణయంతో చాలా ఊరట దక్కుతుంది. ప్రపోజల్​కు గ్రీన్ ​సిగ్నల్​వస్తే దీని ఏజీఆర్ బకాయిలు రూ.52 వేల కోట్లు తగ్గుతాయి. ఎయిర్​టెల్ ​బకాయిలు రూ.38 వేల కోట్ల వరకు, టాటా టెలిసర్వీసెస్​ బకాయిలు రూ.14 వేల కోట్ల వరకు పడిపోతాయి.

 ఏజీఆర్​కు కేంద్రం ఇచ్చిన  నిర్వచనాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు టెల్కోలు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. వీటిలో రూ.92,642 కోట్ల లైసెన్సు ఫీజు, రూ.55,054 కోట్ల స్పెక్ట్రమ్​ వాడకం చార్జీలు ఉన్నాయి. ఈ మొత్తంలో 75 శాతం పెనాల్టీలు, వడ్డీలే ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి వొడాఫోన్ ​ఐడియా ఏజీఆర్​ బకాయిలు రూ.85 వేల కోట్లకు, ఎయిర్​టెల్​బకాయిలు రూ.44 వేల కోట్లకు, టాటా టెలీసర్వీసెస్​ బకాయిలు రూ.19 వేల కోట్లకు చేరుతాయని అంచనా.