- నాలుగు నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ
- ఏపీతో కలిసి రోడ్‌మ్యాప్ తయారీపై కసరత్తు
- మొదటిసారి అంశాలవారీగా స్పష్టత
- షెడ్యూల్ 9, 10 సంస్థల్లో కార్పొరేషన్లవారీగా పరిష్కారం
- సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసులు ఉపసంహరణ
హైదరాబాద్, వెలుగు: విభజన సమస్యలను నాలుగు నెలల్లోగా పరిష్కరించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు డెడ్‌లైన్ పెట్టుకున్నాయి. ఎంతకూ ఏకాభిప్రాయానికి రానివాటిని తప్ప మిగిలిన వాటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలు డిసైడ్అయ్యారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కూడిన ఉన్నతాధికారుల కమిటీ రెండు వారాల్లోపే సమావేశం కానున్నది. అందులోనే సగం అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా 9,10వ షెడ్యూళ్లలో ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఇష్యూస్‌ను క్లియర్ చేయనున్నారు.
ఆ తర్వాత మరికొన్నింటిపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలపై రిపోర్ట్ తయారు చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీలో చర్చించి.. 90 శాతం వరకు సమస్యలకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. వచ్చే నెల పూర్తయ్యేలోగా ఉన్నతాధికారుల సమావేశాలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆ తర్వాత సెప్టెంబర్‌లో మంత్రుల కమిటీ భేటీలు, నవంబర్, డిసెంబర్ లో సీఎంల భేటీలు నిర్వహించి విభజన సమస్యలన్నింటికీ చెక్‌పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం రోడ్‌మ్యాప్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి ఏయే అంశాల్లో.. ఎక్కడెక్కడ.. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానిపై పూర్తి వివరాలు రెడీగా ఉన్నాయి. అంశాలవారీగా ఉన్నతాధికారులు, మంత్రుల సమావేశాల్లో వాటిపై ఏకాభిప్రాయం తీసుకుని క్లియర్ చేయనున్నారు. ఎంతకీ పరిష్కారం కాని వాటిపై కేంద్రంతో తేల్చుకోవాలని నిర్ణయించారు.
కమిటీల్లో చర్చించాల్సిన అంశాలపై క్లారిటీ
విభజన సమస్యల కోసం రెండు రాష్ట్రాలు రెండు కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో సీఎస్ ఉన్నతాధికారుల కమిటీతో పాటు మంత్రుల కమిటీ ఉన్నది. ఏ కమిటీలో ఏం చర్చించాలనే దానిపైనా క్లియర్‌గా ఎజెండా రెడీ చేసుకోనున్నారు. అధికారుల కమిటీలో చర్చించే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఫైనాన్స్సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.
ఏపీ స్థానికత కలిగిన 1,853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశం, సివిల్సప్లై డిపార్ట్మెంట్కు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ, ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలిపడంలాంటి అంశాలన్నీ అధికారుల మీటింగ్‌ల్లోనే తేల్చేయనున్నారు.
భూములు, నిధుల వాటాలపైనే పేచీ
విభజన సమస్యల్లో రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికరంగా భూములు, నిధుల వాటాలే ఉన్నాయి. దీంతో ముందుగా చిన్న సమస్యలనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఏపీకి హైదరాబాద్‌లో లీజుకు భవనాలు, టీటీడీలో తెలంగాణకు భాగస్వామ్యం, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ వంటి వాటిపై తెలుగు రాష్ట్రాలు సానుకూలంగానే ఉన్నాయి. ఇదే విషయాన్ని సీఎంల భేటీలోనూ ప్రస్తావించారు.
ఫిల్మ్ డెవలప్ మెంట్, టీఎస్ఎంఎస్ఐడీసీ, మినరల్ డెవలప్మెంట్ఆస్తుల పంపకాలు, షేర్లపైనా రెండు రాష్ట్రాలు చెరొక వాదనను వినిపిస్తున్నాయి. ఇక కొన్ని సంస్థల్లో జాయింట్అకౌంట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వీటిపైనా కూడా పేచీ నడుస్తోంది. భూములకు సంబంధించి.. డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి, స్టే ఆర్డర్ తెచ్చుకుంది.
ఏపీ స్టేట్ ఫైనాన్స్కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్‌కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు కోర్టులో స్టే తీసుకుంది. పదో షెడ్యూల్లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాల్సి ఉండగా.. దీనిపైనా రిట్పిటిషన్దాఖలైంది.
తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్‌యూ ఫైన్ఆర్ట్స్యూనివర్సిటీకి సంబంధించి నిధుల పంపకాల్లో ఇబ్బందులు ఉన్నాయి. పవర్ బకాయిలపైనా కూడా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేదు. దీంతో వీటిపై మంత్రుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. లేదా నేరుగా సీఎంలకు ప్రతిపాదిస్తారు.