- రెండేండ్లుగా బకాయిలు చెల్లించని సర్కారు
- రూ. 10 కోట్ల కోసం నేత కార్మికుల ఎదురుచూపులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : చేనేత కార్మికులకు యార్న్సబ్సిడీ విడుదల చేయడంలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తోంది. బతుకమ్మ చీరల ఉత్పత్తి కి సబంధించి రెండేండ్ల యారన్ సబ్సిడీ రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంది. సబ్సిడీ వస్తే ఖర్చులకు ఎంతోకొంత ఉపయోగపడతాయని కార్మికులు అనుకుంటే.. సర్కారు జాప్యం చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి చూపించడం కోసం బతుకమ్మ చీరల ఉత్పత్తి మొత్తం సిరిసిల్లకే కేటాయిస్తున్నారు. సర్కారు కోరిన విధంగా కార్మికులు చీరలను వివిధ డిజైన్లలో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మెరుగైన కూలి చెల్లించాలని కార్మికులు 2018లో పోరాటం చేశారు. చీరల ఉత్పత్తి మధ్యలో ఉండడంతో ఇప్పుడు కూలి పెంచడం సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పారు. అనంతరం కూలి గిట్టుబాటు కోసం నూలు రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మీటరుకు రూ.1.25 చొప్పున నూలు సబ్సీడీ అందిస్తోంది. కార్మికులు ఉత్పత్తి చేసిన బట్ట ఆధారంగా వారికి సబ్సిడీ అందుతుంది. కానీ ఏనాడూ డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ప్రతిసారీ పెండింగే..
ఒక్కో కార్మికుడికి నూలు రాయితీ రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు రావాల్సి ఉంది. 2018కి సంబంధించిన రాయితీ రూ. 4 కోట్లు 8 వేల మంది కార్మికులకు 2021లో అందించారు. 2-020–21, 2021 – 22 సంవత్సరాలకు కలిపి దాదాపు రూ. 10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంతో పోరాటం చేస్తే తప్పా బకాయిలు రిలీజ్ కాని పరిస్థితి నెలకొంది. సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో పలుసార్లు ఆందోళనలు చేయగా 2019కి సంబంధించిన యార్న్ సబ్సిడీ గత నెల రిలీజ్ అయ్యింది. ఇంకా డబ్బులు పూర్తిస్థాయిలో కార్మికుల ఖాతాల్లో చేరలేదు. ఎందుకు జమ చేయలేదని కార్మికులు చేనేత జౌళి శాఖ ఆఫీసర్లను అడిగితే టెక్నికల్ సమస్యలున్నాయని చెబుతున్నారు. 2019లో బతుకమ్మ చీరల ఉత్పత్తిలో భాగస్వాములైన 2032 మంది నేతన్నలకు రూ. 3.51 కోట్లు గత నెల చెల్లించారు. ఇంకా 2,899 మందికి 4.92 కోట్లు ఈ వారంలో రిలీజ్ కాగా కార్మికులు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా రెండేండ్లకు సంబంధించిన డబ్బులు అందాల్సి ఉంది. సర్కారు తీరుతో తమకు ఏటా ఎదురుచూపులు తప్పడం లేదని, ఏ ఏడాదికి ఆ ఏడాది సబ్సిడీని క్లియర్ చేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఎప్పటికప్పుడు ఇయ్యాలె
2019 యార్న్ సబ్సిడీ మాత్రమే అందింది. ఇంకా రెండేండ్ల సబ్సిడీ అందాల్సి ఉంది. సబ్సిడీ ద్వారా నాలాంటి కార్మికులకు రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు వస్తాయి. ఇది మాకెంతో ఆసరాగా ఉంటోంది. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన సంవత్సరమే యార్న్ సబ్సిడీ అందితే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. - నక్క దేవదాస్, నేత కార్మికుడు, సిరిసిల్ల
టెస్కో ప్రోసీడింగ్స్ పంపలేదు
బతుకమ్మ చీరలకు సంబంధించిన రెండేండ్ల యార్న్ సబ్సిడీ బకాయిలు కార్మికులకు అందాల్సి ఉంది.2021, 2022కు సంబంధించి టెస్కో ఇంకా ప్రోసీడింగ్స్ పంపలేదు. యార్న్ సబ్సిడీ సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. 2019కి సంబంధించి ఇప్పటికే కార్మికుల ఖాతాలో జమ చేశాం. రెండేండ్లకు సంబంధించిన సబ్సిడీ రిలీజ్ అయిన వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేస్తాం. - సాగర్, చేనేత జౌళిశాఖ ఏడీ