- కరోనాతో మరణించిన కార్మికులకు పరిహారం ఇయ్యలే!
- ఇచ్చినట్లుగా సఫాయి కర్మచారి కమిషన్‌కు చెప్పిన బల్దియా కమిషనర్
- 26 మందికి ఒక్కొక్కరికి రూ.14 లక్షలు అందినట్లుగా అధికారుల ప్రచారం
- బాధిత కుటుంబాలు నెలలుగా ఎదురుచూపు
- కొందరికి ఉద్యోగాలు కూడా కల్పించని బల్దియా
“బల్దియా సెంట్రల్ జోన్ లో ఎస్ఎఫ్ ఉద్యోగి ప్రభాకర్ కరోనాతో ఆస్పత్రి లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్దిరోజుల కిందట మృతిచెందాడు. ఫ్యామిలీకి ఒక్కరూపాయి పరిహారం అందలేదు. ఆయన భార్య ఇంటర్‌వరకు చదివినా జాబ్ కల్పించ లేదు.’’ ఎట్ల బతకాలో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వెస్ట్ జోన్ శానిటేషన్ వర్కర్ ఉప్పలయ్య కొంతకాలం కిందట కరోనాతో చనిపోయాడు. అతని కుటుంబానికి ఇంకా పరిహారం ఇయ్యలేదు. అధికారులను అడిగితే రేపు మాపు అంటూ తిప్పుతున్నారు. ఇవ్వకుండా తిప్పించుకుంటుండగా ఇబ్బందులు పడుతున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.
హైదరాబాద్, వెలుగు: గతేడాది నుంచి కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబాలకు బల్దియా పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తోంది. రోడ్లు ఊడ్చేవారు, కొవిడ్పేషెంట్ల చెత్తను తరలించినవారు, కరోనా బాధితులకు సరుకులను అందించిన కార్మికుల్లో చాలామంది కరోనాతో చనిపోయారు. కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లో సెలవులు లేకుండా డ్యూటీలు చేసి చివరకు కరోనాకు బలయ్యారు. వారికి పరిహారం ఇవ్వకపోవడంతో పాటు కొంతమంది కార్మిక కుటుంబాల్లో అర్హులుగా ఉన్న వారికి జాబ్‌లు కూడా కల్పించలేకపోతున్నారు. ఇప్పటికే ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉన్న వారిని బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది కార్మికులు కరోనాతో చనిపోయారు. వారిలో ఒక్కొక్కరికి రూ.14 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్లు ఇటీవల సఫాయి కర్మచారి కమిషన్ ఎదుట కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. కానీ ఒక్కరికి కూడా పరిహారం డబ్బులు అందలేదని బాధితులు చెబుతున్నారు. త్వరలో 26 మంది కుటుంబాలకు పరిహారం అందిస్తామని బల్దియా అధికారులు అంటున్నారు.
చెప్పేదొకటి.. చేసేది మరొకటి..
ఈ నెల 11న సిటీకి వచ్చిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ మెంబర్అంజనా పన్వార్ బల్దియా కమిషనర్లోకేశ్కుమార్ను పలు అంశాలపై ప్రశ్నించారు. కరోనాతో మరణించి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆమె అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ .. ఇప్పటి వరకు కరోనాతో 26 మంది చనిపోయారని, ఒక్కొక్కరికి రూ.14లక్షల చొప్పున మొత్తం రూ.3.64 కోట్లు ఇచ్చామని ఆయన చెప్పారు. అయితే డబ్బులు ఇంకా బాధిత కార్మిక కుటుంబాలకు అందలేదు. మరోవైపు డబ్బులకు బల్దియాకు సంబంధంలేదని అధికారులు చెబుతున్నారు. మరణించిన కార్మికుడి పీఎఫ్ తో పాటు ఇన్సూరెన్స్డబ్బులను మాత్రమే బల్దియా ఇప్పిస్తుందని పేర్కొంటున్నారు.
కార్మికుల వివరాల్లేవ్
బల్దియా వద్ద పర్మినెంట్ఎంప్లాయీస్తో పాటు ఔట్ సోర్సింగ్కార్మికుల వివరాలు సరిగా లేవు. చాలా మంది మరణించిన తర్వాత వారికి అందాల్సిన బెనిఫిట్స్ అందడంలేదు. ఈ క్రమంలో కరోనాతో చనిపోయిన కార్మికుల సంఖ్యను పూర్తిగా గుర్తించట్లేదని తెలిసింది. ఉద్యోగులు, కార్మికులు నష్టపోతున్నారన్న విషయాన్ని గుర్తించిన బల్దియా అధికారులు ఉద్యోగుల వివరాలన్నింటిని ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తున్నారు. దీనికోసం హ్యుమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టం(హెచ్ఆర్ఎంఎస్) తో డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. దీని కింద పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్‌ఉద్యోగుల వివరాలను ఈ ఆఫీస్ ద్వారా ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తున్నారు. ఈ నెల 25 లోపు ఈ ప్రక్రిమ పూర్తికానుంది. దీనివల్లనే కొందరు కార్మికులు నష్టపోయారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఆందోళన చేస్తం
బల్దియా కార్మికులు 40 మందికి పైగా కరోనాతో చనిపోతే అధికారులు మాత్రం 26 మంది అంటున్నారు. వీరికి 14 లక్షల చొప్పున అందించామని కమిషనర్ చెబుతున్నారు. ఎక్కడ ఇచ్చారో చూపించాలె. పరిహారం ఇవ్వకుండానే ఇచ్చామంటున్నారు. బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తం.
- గోపాల్, గ్రేటర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్