రోడ్ల రిపేర్లకు పైసా ఇయ్యని సర్కారు

రోడ్ల రిపేర్లకు పైసా ఇయ్యని సర్కారు

రాష్ట్రంలో వానలకు 2వేల కిలోమీట్లర్లకు పైగా డ్యామేజీ

రూ.వెయ్యి కోట్లు కావాలని జిల్లాల నుంచి ప్రపోజల్స్​

3 నెలలుగా సర్కారు నో రెస్పాన్స్

డాంబర్ కొట్టుకపోయి, గుంతలు పడ్డ రోడ్లతో నరకం చూస్తున్న పబ్లిక్

కంకర తేలిన రోడ్లతో పెరుగుతున్న ప్రమాదాలు

ఎమర్జెన్సీ అయితేనే రాత్రి పూట బండి తీస్తున్రు

వెలుగు, నెట్​వర్క్: ఈ ఏడాది ఆగస్టు, అక్టోబర్​ నెలల్లో కురిసిన వర్షాల వల్ల ఖరాబైన రోడ్లు, కల్వర్టుల రిపేర్ల​కు సర్కారు నయా పైసా ఇవ్వలేదు. రోడ్ల రిపేర్లు, ప్యాచ్ వర్క్స్ కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు కావాలని జిల్లాల నుంచి ఆర్​అండ్​బీ ఆఫీసర్లు ప్రపోజల్స్​ పంపి మూడు నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి రెస్పాన్స్​ లేదు.  డాంబర్ కొట్టుకపోయి, కంకర తేలి, గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణికులు రోజు నరకం చూస్తున్నారు.

డాంబర్ కొట్టుకపోయి, గుంతలు పడి

వానలతో రాష్ట్ర వ్యాప్తంగా 2వేల కిలోమీటర్లకుపైగా ఆర్​అండ్​బీ రోడ్లు డ్యామేజీ అయ్యాయి. డాంబర్ మొత్తం కొట్టుకపోయి, కంకర తేలి, గుంతలు పడి రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దెబ్బతిన్న రోడ్లలో పంచాయతీరాజ్, ఆర్​అండ్​బీ రోడ్లతో పాటు నేషనల్ హైవేలు కూడా ఉన్నాయి. లోకల్ ఫండ్స్​తో పంచాయతీరాజ్, మున్సిపల్ రోడ్లను, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్​తో నేషనల్​హైవేలకు రిపేర్లు చేసినప్పటికీ ఆర్​అండ్​బీ రోడ్లు మాత్రం అట్లనే ఉన్నయి.

జిల్లాలవారీగా ఆ శాఖ ఆఫీసర్లు ఎన్ని రోడ్లు దెబ్బతిన్నాయో, రిపేర్లకు ఎన్ని పైసలు కావాలో ప్రపోజల్స్ పెట్టి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఖమ్మం, వరంగల్​ అర్బన్ జిల్లాలకు కొన్ని ఫండ్స్ వచ్చినట్లు చెబుతున్న ఆఫీసర్లు ఇంకా టెండర్లు పిలిచే పనిలోనే ఉన్నారు. ఫండ్స్ వచ్చి.. టెండర్లు ఖరారై, పనులు కావాలంటే కనీసం మరో మూడు నెలలు పడుతుంది. దీంతో అప్పటిదాకా పబ్లిక్​కు కష్టాలు తప్పేలా లేవు.

వాహనదారులకు నిత్య నరకం

అధ్వానంగా మారిన రోడ్లతో రాష్ట్ర వ్యాప్తంగా వెహికలిస్టులు రోజు నరకం చూస్తున్నారు. ఎక్కడ ఏ రోడ్డు సడెన్​గా ఎండ్ అవుతుందో, ఏ గుంతలో పడి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. బైక్​లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. కొన్ని రోడ్లపై ఇదివరకు గంటలో వెళ్లిన ప్రయాణానికి రెండు గంటలు పడుతోందని వెహికిలిస్టులు అంటున్నారు. కళ్లల్లో దుమ్ముపడి, బైకులు గుంతల్లో పడి, ఆటోలు అదుపుతప్పి ప్రాణాలు కోల్పోతున్నా రిపేర్లు మాత్రం చేస్తలేరని విమర్శిస్తున్నారు.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి..

మెదక్ జిల్లాలో 26.70 కిలో మీటర్ల రోడ్లు, రెండు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. రూ.5.79 కోట్లతో ప్రపోజల్స్ పంపారు. సంగారెడ్డి జిల్లాలో165 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజీ కాగా, రూ.26 కోట్లతో ప్రపోజల్స్ పెట్టారు. ఇప్పటివరకు పైసా రాకపోవడంతో పనులు స్టార్ట్​ చేయలేదు.

ఖమ్మం జిల్లాలో 150 కిలో మీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రిపేర్లు, ప్యాచ్ వర్క్ ల కోసం రూ.70 కోట్లు కావాలని ప్రపోజల్స్ పెట్టారు. రూ.32 కోట్లు మంజూరుకాగా, టెండర్లు ఇంకా ఫైనల్​ కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 23రోడ్లు  డ్యామేజ్ అయ్యాయి. రూ 96 కోట్లతో ప్రపోజల్స్ పంపి, ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

మహబూబ్​నగర్​జిల్లాలో 11 రోడ్లు, 8 కల్వర్టులకు రూ.3.5 కోట్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 195 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజీ కాగా, రూ.80 కోట్లకు ప్రపోజల్స్​ పంపారు. నారాయణపేట జిల్లాలో రూ.2 కోట్లు కావాలని ప్రపోజల్స్ పెట్టినా పైసా రాలేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో  79 ఆర్అండ్​బీ రోడ్లు దెబ్బతిన్నాయి. రూ.109 కోట్లతో ప్రపోజల్స్​ పంపారు. ఇంకా డబ్బులు రిలీజ్ కాలేదు.

వరంగల్ అర్బన్ జిల్లాలో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్ల రిపేర్​కు రూ. 47 కోట్లతో ప్రపోజల్స్​ పంపించారు. ప్రభుత్వం నుంచి రూ.12 కోట్లు మంజూరు కాగా, పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి.

కామారెడ్డి జిల్లాలో 82 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు ఆర్అండ్​బీ ఆఫీసర్లు గుర్తించారు. రిపేర్ల కోసం రూ.31 కోట్లతో ప్రపోజల్స్​ పంపినా పైసలు రాలేదు.

మంచిర్యాల జిల్లాలో రిపేర్ల కోసం రూ.2 కోట్లతో ప్రపోజల్స్​ పంపారు. ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.

కరీంనగర్​జిల్లాలో 86 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి రిపేర్​ కోసం రూ. 40 కోట్లు కావాలని ప్రపోజల్స్ పంపారు. పెద్దపల్లి జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల రిపేర్ కోసం రూ.31 కోట్లతో ప్రపోజల్స్ పంపారు. ఫండ్స్ లేవన్న సర్కారు, సింగరేణి నుంచి వచ్చే డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్​మెంట్ ఫండ్ నుంచి తీసుకోవాలని సూచించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇటీవలి వర్షాలకు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ఆర్​అండ్​బీ రోడ్లు మొత్తం ఖరాబైనయ్. మామిడిపల్లి, వట్టిమల్ల ఊర్ల దగ్గర మూలవాగు లోని లో లెవెల్ బ్రిడ్జిలు సగానికిపైగా డ్యామేజీ అయ్యాయి. దీంతో రాకపోకలకు పబ్లిక్​కు మస్తు ఇబ్బంది అయితుంది.

గంట జర్నీ రెండు గంటలైతాంది..

జైనూర్ నుంచి ఆసిఫాబాద్ కు ఇదివరకు గంటలో పోయేటోళ్లం. ఇప్పడు రెండు గంటలు పడుతాంది. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే నరకం కనిపిస్తంది. డాంబర్ కొట్టుకపోయి కంకర తేలింది, గుంతలువడి యాక్సిడెంట్లు అయితున్నయ్. రాత్రిపూట ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరూ రోడ్డెక్కుత లేరు. రోడ్డు ఖరాబై నెలలు గడుస్తున్నా ఆఫీసర్లు రిపేర్ చేస్తలేరు.

– ఆత్రం భగవంత్ రావు, జైనూర్

నరకం కనిపిస్తంది..

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నుంచి భూపాలపట్నం మీదుగా ఎలిగేడుకు రెగ్యులర్ గా టూ వీలర్ మీద పోతుంట. వానలతో ఖరాబైన రోడ్డును రిపేరే చేస్తలేరు. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే. దీంతో వెన్నునొప్పి వస్తోంది. టూ వీలర్లపై, ఆటోల్లో వెళ్లేవాళ్ల కష్టాలు చెప్పవశం కాదు. రోడ్డు బాగలేక నైట్ టైమ్ చాలా యాక్సిడెంట్లు అయితున్నయి.

‑ బాలి శ్రీనివాస్, చొప్పదండి

సూర్యాపేట జిల్లాలోని నాగరం–తుంగతుర్తి రోడ్డు అక్టోబర్​లో కురిసిన వానలకు ఇట్ల దారుణంగా తయారైంది. 12 కిలోమీటర్ల ఈ రోడ్డు రిపేర్​కు రూ.8లక్షలు అవసరమని ఆర్​అండ్​బీ ఆఫీసర్లు ప్రపోజల్స్ పెట్టారు. నెలలు గడుస్తున్నా పైసా రిలీజ్ కాలేదు. రిపేర్ చేయకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల తుంగతుర్తి ఎంపీడీవో కారు ఓ గుంతలో పడిపోతే ఇట్ల ట్రాక్టర్​తో తీయాల్సి వచ్చింది.