
నేరేడుచర్ల, వెలుగు: ప్రతిఒక్కరూ క్షయవ్యాధి నుంచి విముక్తి పొందడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కోట చలం అన్నారు. నేరేడుచర్ల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్, క్షయమిత్ర పౌష్టికాహార సహాయ కార్యక్రమంలో భాగంగా శనివారం భారతి రంగ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పౌష్టికాహార కిట్లు దోహదపడతాయన్నారు.
క్షయ వ్యాధి చికిత్స కాలం 6 నెలలకు సరిపోను పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొగ తాగడం, మత్తు పానియాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి లోపించి క్షయవ్యాధి ప్రబలుతుందని తెలిపారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ నజియా మాట్లాడుతూ రోగ నిరోధక శక్తిని కోల్పోకుండా ఈ పౌష్టికాహార కిట్లు ఉపయోగపడతాయన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 800 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ వో జయమనోరి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగిని, బ్రౌజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటశ్రీధర్ పాల్గొన్నారు.